అవే నా పెళ్ళికి ప్రధాన అడ్డంకి !

పూర్ణ… ఈ బహు భాషానటి మొదట్లో మోడలింగ్, బుల్లితెర యాంకరింగ్‌ చేసి 2004లో నటనకు శ్రీకారం చుట్టింది. కోలీవుడ్‌కు 2008లో ‘మునిరయాండి విలంగియల్‌ మూండ్రామాండు’ చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. ఇస్లామ్‌ మతానికి చెందిన పూర్ణ అసలు పేరు షమ్నాఖాసీం అన్న విషయం చాలా మందికి తెలిసుంటుంది.  మాతృకం మలయాళం అయినా కోలీవుడ్, టాలీవుడ్‌ అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించేస్తున్న ఈ బహు భాషానటి  తాజాగా నటనకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అవుతోంది.తెలుగులో డజనుకు పైగా సినిమాలు చేసిన పూర్ణ ప్రస్తుతం మలయాళంతో పాటు తెలుగులో ‘సువర్ణసుందరి’, తమిళంలో ‘అడంగ మను’, ‘ఇవనుక్కు ఎంగయో మచ్చ ఇరుక్కు’ చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. పూర్ణ మంచి డాన్సర్‌ అన్న విషయం తెలిసిందే. ఖాళీగా ఉంటే స్టేజీ పోగ్రామ్స్‌ ఇవ్వడానికి ఇష్ట పడుతుంది.
పూర్ణకు ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న పెళ్లి ఎప్పుడన్నదే. తన పెళ్లికి పలు అంశాలు అడ్డంకులుగా మారుతున్నాయని వాపోతోంది నటి పూర్ణ.  ఈ అమ్మడికన్నా వెనుక వచ్చిన చాలా మంది నటీమణులు పెళ్లిళ్లు చేసుకుని పిల్లాపాపలతో సంసారం చేసుకుంటున్నారు. ఈ విషయం గురించి నటి పూర్ణ ఇటీవల ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ… తన పెళ్లి గురించి తన తల్లి మాట్లాడని రోజు లేదని అంది.తనకూ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉందనీ, అందుకు పలు ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పింది. అందులో ముఖ్యంగా జాతి,మత సమస్య అని పేర్కొంది. అది పట్టించుకోకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అంటున్న వారు… వివాహానంతరం నేను నటనను, నాట్యాన్ని మానుకోవాలని షరతులు విధిస్తున్నారని చెప్పింది. ఇక ప్రేమ వివాహం చేసుకుందామన్నా, అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు రావని గ్యారెంటీ ఉంటుందా? అని ప్రశ్నించింది. అందుకే తన వివాహం వాయిదా పడుతోంది అని చెప్పింది. కాగా జాతి,మత జాడ్యం లేని, ఎలాంటి షరతులు విధించని వ్యక్తి తారస పడితే వివాహం చేసుకోవడానికి తాను రెడీ అని అంటోంది.ఆమెను అర్ధం  చేసుకుని, ఆమె మనసును గెలుచుకునేవాడు తొందర్లోనే దొరకాలని కోరుకుందాం.