తెలుగు ప్రేక్షకుల కోసం రంభ మళ్ళీ వస్తోంది !

డ్యాన్సింగ్ గ్రేస్‌తో పాటు మంచి యాక్టింగ్ టాలెంట్ ఉన్న రంభ తెలుగులో అగ్ర హీరోలు అందరి సరసన ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ‘హిట్లర్’, ‘బావగారూ బాగున్నారా’ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవికి ధీటుగా స్టెప్పులు వేసిన హీరోయిన్ రంభ చిత్ర పరిశ్రమకు దూరమైనా ఆమెను  మర్చిపోలేం . ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అచ్చం దివ్యభారతిలా ఉందంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు.ఆమె తెలుగులో చివరిగా కనిపించిన సినిమా 2008లో వచ్చిన ‘దొంగసచ్చినోళ్లు’ . పెళ్లయ్యాక సినిమాలు మానేసి పూర్తిగా కుటుంబానికి అంకితమై పోయింది రంభ.

ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఆమె వ్యాపారవేత్త అయిన తన భర్తతో విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లిందని కోలీవుడ్ టాక్. అయితే త్వరలో రంభ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. కమిడియన్ సప్తగిరి హీరోగా రూపొందే సినిమాలో ఓ కీలక పాత్రకు ఆమె ఓకే చెప్పినట్టు తెలిసింది. అల్లరి నరేష్‌తో ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం’ సినిమా తీసిన దర్శకుడు ఈశ్వర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాలో రంభ పాత్ర ఎలా ఉంటుందనేది ఇంకా తెలియరాలేదు. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ మూవీ టైటిల్ ఇంకా ఖరారు కాలేదు.