ఇదివరకటి కంటే కాస్త బెటర్‌ అయ్యా !

పదిహేనేళ్ల కెరీర్‌ తర్వాత ‘బాహుబలి’ సినిమాలతో వచ్చిన అమితమైన స్టార్‌డమ్‌ను ఎలా హ్యాండిల్‌ చేయాలో ప్రభాస్‌కు అర్థం కావట్లేదట . ‘‘మా హీరో ఎక్కువగా బయటకు రాడని నా అభిమానులు బ్యాడ్‌గా ఫీలవుతుంటారు. ఈ విషయంలో ఇదివరకటి కంటే ఇప్పుడు కాస్త బెటర్‌ అయ్యాను. ఇంకా మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నా’’ అన్నారు ప్రభాస్‌.
ప్రభాస్‌ ఒక హోటల్‌ యజమాని అయ్యేవారు! అవును….నటుడు కాకపోయుంటే ప్రభాస్‌ ఏమయ్యేవారు?  ఇదే విషయాన్ని ఒక న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘‘నేను సోమరిపోతును కాబట్టి ఉద్యోగాలు చేయలేను. అందుకని ఏదో ఒక వ్యాపారం చేద్దామనుకున్నా. మా కుటుంబానికి ఆహారం అంటే ఇష్టం కాబట్టి… బహుశా హోటల్‌ బిజినెస్‌లోకి వెళ్లుండేవాణ్ణి. పైగా హైదరాబాద్‌లో ఉత్తరాది తిండికి మంచి గిరాకీ’’ అని చెప్పారు ప్రభాస్‌.
నటుడు కావడం అసాధ్యమని అనుకున్నా!
అలాంటప్పుడు ఆయన నటుడిగా కెరీర్‌ను ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న వస్తుంది.దానికి సమాదానం చెబుతూ ….‘‘ఒక రోజు బాపుగారి దర్శకత్వంలో మా పెదనాన్న నటించిన ‘భక్త కన్నప్ప’ సినిమా చూస్తుంటే, ఆ కేరక్టర్‌లో నన్ను ఊహించుకున్నా. బహుశా అప్పట్నించే నటుణ్ణి కావాలనే ఆలోచన నా మనసులో మొదలైందనుకుంటాను’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.
అయితే నటుడు కావడం అసాధ్యమని ఒక దశలో ప్రభాస్‌ అనుకున్నారు.‘‘పెదనాన్న నటుడు, నాన్న నిర్మాత. ‘నటన మీద నీకు ఆసక్తి ఉందా?’… అని ఆయనడిగారు. ‘లైట్ల మధ్య… అనేకమంది మనుషులు చుట్టూ చూస్తుండగా …భావాలు పలికిస్తూ ఎవరైనా ఎలా నటిస్తారు?’ అనే ఫీలింగ్‌ నాది. అందుకే చెప్పడానికి సిగ్గుపడ్డా. ఒకటికి రెండు సార్లు అమ్మానాన్నలు ఈ విషయం అడిగితే …’అది నా వల్ల కాద’ని చెప్పాను. కానీ చివరకు ‘ఈశ్వర్‌’ (2002)తో కెమెరా ముందుకు వచ్చాను’’ అని చెప్పారు ప్రభాస్‌.  ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న ‘సాహో’ షూటింగ్ జరుగుతోంది.