త్వ‌ర‌లో ప్ర‌భాస్ టీవీ ఛానెల్ ప్రారంభం ?

స్టార్ హీరోస్, హీరోయిన్స్ ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉంటూనే వ్యాపార రంగంలోను రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో నాగార్జున ,చిరంజీవి  ప్ర‌ముఖ ఛానెల్‌లో భాగ‌స్వామిగా ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కూడా ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌లో భాగ‌స్వామి అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌భాస్ స్నేహితులు వంశీ కృష్ణా రెడ్డి, ఉప్ప‌ల‌పాటి ప్ర‌మోద్‌లు త్వ‌ర‌లో ఓ టీవీ ఛానెల్ ప్రారంభిస్తున్నారు,అందులో ప్ర‌భాస్ కూడా భాగ‌స్వామి కానున్నార‌ని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా స్టార్స్ ఓ వైపు న‌ట‌న‌ని కొన‌సాగిస్తూనే మ‌రోవైపు బిజినెస్ పై దృష్టి పెట్ట‌డం విశేషం. ఇటీవ‌లి కాలంలో మ‌హేష్ బాబు ‘ఏఎమ్‌బీ’ అనే మ‌ల్టీ ప్లెక్స్‌తో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విష‌యం విదిత‌మే. బ‌న్నీ కూడా త్వర‌లోనే ఓ మ‌ల్టీప్లెక్స్ నిర్మించ‌నున్నాడ‌ట.మరి కొంతమంది హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రబాస్‌ ‘సాహో’ చిత్రంతో పాటు రాధాకృష్ణ సినిమాతో బిజీగా ఉన్నాడు ,’సాహో’ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నెలరోజుల పాటు ట్యూషన్
ప్రభాస్ ‘సాహో’ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ వచ్చి రెండేళ్లు పూర్తయిన తర్వాత ఈ కథానాయకుడి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అధిక శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సాహో’ మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిల్మ్‌మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం విడుదలకానుంది. దీంతో ‘సాహో’ ప్రమోషన్ కోసం ప్రభాస్ జాతీయ మీడియాకు కూడా అందుబాటులోకి రాబోతున్నారు.
 
ఈ చిత్రం కోసం అతను మొదటిసారి హిందీ డబ్బింగ్ స్వయంగా చెబుతున్నారు. దీని కోసం ప్రభాస్‌కు ఓ హిందీ టీచర్ నెలరోజుల పాటు ఏకధాటిగా ట్యూషన్ చెప్పిందట. ఆతర్వాత నమ్మకం కుదిరాకే హిందీలో స్వంతంగా డబ్బింగ్ చెప్పాలనే నిర్ణయం తీసుకున్నారట ప్రభాస్. నిజానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లాంటి సీనియర్ హీరోలు స్ట్రెయిట్ గా హిందీ సినిమాలు చేసినా డబ్బింగ్ మాత్రం చెప్పలేదు. కానీ ప్రభాస్ ఇంత ధైర్యంగా సిద్ధమయ్యారంటే సాహసమే !