ఎనిమిది నిమిషాలు… డబ్బై కోట్లు !

‘సాహో’ చిత్రబృందాన్ని ‘కాలం ఎంత విలువైనది?’ అని అడిగితే మాత్రం …ఒక నిమిషం విలువ ఎనిమిదిన్నర కోట్లు. ఎనిమిది నిమిషాలు సుమారు 70 కోట్లు అంటున్నారు. బాబోయ్‌ అంతా! అంటే అవును మరి… కేవలం ఎనిమిది నిమిషాల యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం సుమారు 70 కోట్లు వెచ్చించారట ‘సాహో’ చిత్రబృందం.
ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు.శ్రద్ధా కపూర్‌ కథానాయిక. దుబాయ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అక్కడ యాక్షన్‌ ఎపిసోడ్‌ తీశారు. అయితే ఆ ఎపిసోడ్‌ లెంగ్త్‌ ‘ఎనిమిది నిమిషాలు’ అన్నది తాజా ఖబర్‌. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం దాదాపు వంద రోజులు ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ జరిపారట యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌. ఈ ఫైట్‌ సీక్వెన్స్‌లో ప్రత్యేకమైన కారుని కూడా ఉపయోగించారట కెన్నీ బేట్స్‌. సుమారు ఎనిమిది నిమిషాల నిడివి ఉన్న ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం 70 కోట్లు ఖర్చు చేసిందట చిత్రబృందం. ఈ భారీ యాక్షన్‌ కోసమే 28 కార్లు, 5 ట్రక్కులను క్రాష్‌ చేశారు. శంకర్‌ ఎహాసన్‌ లాయ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2019 ప్రథమార్ధంలో రిలీజ్‌ కానుంది.

యూరప్‌ లో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

ప్రస్తుతం ‘సాహో’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ‘యంగ్ రెబల్‌స్టార్‌’ ప్రభాస్‌ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్‌ చేశాడు. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు ఓకె చెప్పాడు ప్రభాస్‌. ఈ సినిమా షూటింగ్‌ జూన్‌లోనే ప్రారంభించాల్సి ఉన్నా ‘సాహో’ షూటింగ్ ఆలస్యమైన కారణంగా తదుపరి చిత్రాన్ని ఆగస్టులో ప్రారంబించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్‌ సంస్థే నిర్మించనుంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటించనుంది. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మేజర్‌ పార్ట్‌ విదేశాల్లోనే చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు హైదరాబాద్‌లో సెట్స్‌ వేసి షూట్‌ చేసినా అవి కూడా విదేశాల్లో అన్నట్టుగానే చూపించనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.