ముప్పైశాతం సినిమాకి ‘సాహో’ అంటూ 120 కోట్లు !

‘బాహుబలి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను కూడా ప్రభాస్ మార్కెట్ రేంజ్‌కు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.  ‘బాహుబలి’తో తెలుగు సినిమాల బడ్జెట్, మార్కెట్ లెక్కలే మారిపోయాయి. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి తన తర్వాత సినిమాను రూ.250 కోట్ల బడ్జెట్‌లో తీస్తుంటే… హీరో ప్రభాస్  తన కొత్త చిత్రంతో ఆయనను మించిపోయాడు. ప్రభాస్ కథానాయకుడిగా యువ దర్శకుడు సుజిత్ తీస్తున్న ‘సాహో’ బడ్జెట్ అంతకంతకు పెరుగుతూ ఏకంగా రూ.300 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. అసలు ఈ సినిమా చేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు రూ.100 కోట్ల బడ్జెట్ కూడా అనుకోలేదు. కానీ ‘బాహుబలి’తో ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగిపోవడంతో దీని బడ్జెట్ కూడా పెంచుకుంటూ పోయారు.
ఏమాత్రం రాజీ పడకుండా హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేసుకున్నారు. ప్రస్తుతం ఈ త్రిభాషా చిత్రాన్ని భారీ స్థాయిలో తీర్చిదిద్దుతోంది సుజిత్ టీం. ఇప్పటిదాకా ‘సాహో’ చిత్రీకరణ 30 శాతం పూర్తయిందట. కానీ ఇప్పటికే ఖర్చు 120 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఇటీవలే దుబాయ్‌లో యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కేవలం దానికి మాత్రమే రూ.100 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో భారీతనం చూసి తానే షాకయ్యానని ప్రభాసే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇకపైన కూడా భారీ లొకేషన్లలో ఏమాత్రం రాజీ పడకుండా సినిమాను తీర్చిదిద్దబోతున్నారు. చిత్రీకరణ ముందుకు సాగే కొద్దీ సినిమా బడ్జెట్ మరింత పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. వచ్చే ఏడాది ఆగస్టుకు ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రభాస్ హోం బ్యానర్ వంటి యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శంకర్, ఎహసాన్, లాయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
 
రణవీర్‌ సింగ్‌ తో కలిసి మల్టీస్టారర్‌ లో…
ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీపై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్‌ చేసిన కరణ్‌ జోహర్‌, ప్రభాస్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు.అయితే ప్రభాస్‌ బాలీవుడ్‌ కు మల్టీ స్టారర్‌ సినిమాతో పరిచయం అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌  హీరో రణవీర్‌ సింగ్‌ తో కలిసి ఓ మల్టీస్టారర్‌ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్‌. ప్రస్తుతం ప్రభాస్‌, రణవీర్‌లో ఇప్పటికే కమిట్‌ అయిన ప్రాజెక్ట్స్‌ తో బిజీగా ఉండటంతో మల్టీస్టారర్‌ 2019లో సెట్స్‌మీదకు వెళ్లనుందట. అయితే ఈ విషయంపై ప్రభాస్‌ నుంచి గాని కరణ్‌ జోహర్‌ నుంచిగాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.