ఆరు నెలల్లోనే ‘సాహో’ క్లోజ్ చేస్తాం !

‘బాహుబలి’ కోసం చాలా సమయాన్ని కేటాయించిన ప్రభాస్ ఇకపై చకచకా సినిమాలు చేసేస్తాడని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టే ‘బాహుబలి-2’ రిలీజ్ సందర్భంగా థియేటర్లలో తన కొత్త సినిమా ‘సాహో’కు సంబంధించి ఓ చిన్న టీజర్‌ను రిలీజ్‌చేశాడు ప్రభాస్. ‘ఇట్స్ షో టైమ్’.. అంటూ విడుదలైన ఈ సినిమా టీజర్ అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ‘సాహో’కు సంబంధించి పెద్దగా అప్‌డేట్స్ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఒకింత డీలాపడ్డారు. అప్పుడప్పుడు ప్రభాస్‌కు సంబంధించిన డిఫరెంట్ గెటప్‌లు బయటకొస్తుండడంతో ఇవన్నీ ‘సాహో’ కోసమేనని అభిమానులు భావించారు. కానీ ప్రభాస్ గెటప్ విషయమై ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది.

అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని… ప్రభాస్ లేకుండానే కొన్ని రోజులు షూటింగ్ జరిపేశామని ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ మదిరాజు గంగాధరన్ ఎలియాస్ మది తెలియజేశాడు. అతి త్వరలో ప్రభాస్ షూటింగ్‌కు హాజరవుతాడని… ఏకబిగిన ఆరు నెలల్లో ‘సాహో’ షూటింగ్ పూర్తయిపోతుందని ఆయన ప్రకటించడం గమనార్హం. అదేగనుక జరిగితే ప్రభాస్ అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంటుంది. ఓవైపు సినిమా నిర్మాణం, ఇంకోవైపు విజువల్ ఎఫెక్ట్ వర్క్ వెరసి ‘సాహో’చిత్రం శరవేగంగా నిర్మాణం పూర్తిచేసుకుంటుందట. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాకపోవడం గమనార్హం.

‘సాహో’ లో నాయకి ఎవరు?

ప్రస్తుతం అందరిలో కుతూహలాన్ని రేకెత్తిస్తున్న అంశం ఇది. కారణం ‘బాహుబలి–2’ వంటి వంద సంవత్సరాల భారతీయ సినీ రికార్డులను తిరగరాసిన చిత్రం తరువాత ఆ చిత్ర కథానాయకుడు ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. బాహుబలి సిరీస్‌ల వరుసలోనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘సాహో’ చిత్రాన్ని టాలీవుడ్‌ యువ దర్శకుడు సుజిత్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

ఇక్కడి వరకూ ఒకే. ఈ క్రేజీ చిత్రంలో ప్రభాస్‌ సరసన నటించే ఆ లక్కీ నాయకి ఎవరన్నది వెల్లడి కాలేదు. అసలు కథానాయికి ఎంపిక జరిగిందా? లేదా? అన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. అయితే ‘సాహో’ చిత్రంలో హీరోయిన్‌ ఎవరన్న విషయంలో ఇప్పటికే రకరకాల ప్రచారాలు హల్‌చల్‌ చేశాయి. అందులో ప్రధానంగా ప్రభాస్‌తో అధిక చిత్రాల్లో నటించిన అందాల భామ అనుష్క పేరు ఎక్కువగా వినిపించింది. ఆ తరువాత ‘సాహో’ చిత్రం తమిళం, తెలుగుతో సహా హిందీలోనూ రూపొందడంతో చిత్ర యూనిట్‌ కన్ను బాలీవుడ్‌ బ్యూటీలపై పడిందనే ప్రచారం జోరుగా సాగింది.కత్రినాకైఫ్, దిశాపఠాని, పూజాహెగ్డేలతో చర్చలు జరిపినట్లు వైరల్‌ అయ్యింది. తాజాగా ‘సాహో’ హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్‌ పేరు వినిపిస్తోంది. అయితే  చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించే వరకూ వేచి ఉండాల్సిందే. కాగా ఇందులో విలన్‌గా హిందీ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రం ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణను పూర్తి చేసుకుందన్నది గమనార్హం.