‘లార్డ్‌ ఆఫ్‌ రింగ్స్‌’లా రామాయణాన్ని తెరకెక్కిస్తా !

‘రామాయణం ఆధారంగా ఓ భారీ సినిమాను రూపొందించాలనుంది’ అని అంటున్నారు ప్రభుదేవా.
ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా పాపులరైన ప్రభుదేవా డాన్సుల్లోనే కాదు, నటుడిగా, దర్శకుడిగానూ నిరూపించుకున్నారు. నిర్మాతగానూ అభిరుచిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూడు దశబ్దాలకుపైగా సినీ కెరీర్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రభుదేవా మంగళవారం బర్త్‌డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ‘నాకు డాన్సు, సినిమాలే ప్రపంచం. ఇవి తప్ప మరేమీ తెలియదు. సినిమా రంగంలోనే ఎప్పుడూ ఏదో కొత్తగా చేయాలనుకుంటాను. ప్రతి దర్శకుడికీ ఓ కలల ప్రాజెక్ట్‌ ఉంటుంది. రామాయణాన్ని సినిమాగా తెరకెక్కించాలనేది నా కల. దాన్ని హాలీవుడ్‌ చిత్రం ‘లార్డ్‌ ఆఫ్‌ రింగ్స్‌’ తరహాలో రూపొందిస్తాను. ఇలాంటి సినిమాలు తీయడానికి దాదాపు ఐదారొందల కోట్ల బడ్జెట్‌ అవుతుంది. మరో ఐదేండ్ల తర్వాత మన సినిమాల బడ్జెట్‌ రూ.600 కోట్లు దాటుతుందనుకుంటున్నా. అప్పుడే రామాయణం తీస్తా’ అని చెప్పారు. సల్మాన్‌ ఖాన్‌తో ప్రస్తుతం ‘దబాంగ్‌ 3’ చిత్రాన్ని రూపొందించే పనిలో ప్రభుదేవా ఉన్నారు.

సంగీత ఆల్బమ్‌ ‘ ఫేస్‌ ఆఫ్‌ ఇండియా’ 

ప్రభుదేవా ఈ పేరు వింటే యువతలో ఉత్సాహం పొంగుతుంది. తామూ సాధించాలనే తపన ఉరకలు వేస్తుంది. 20 ఏళ్లుగా తనదైన నటన, డాన్స్‌తో యువతను ఉర్రూతలూగిస్తున్న ప్రభుదేవా, దర్శక, నిర్మాతగానూ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం కథానాయకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఈయన తాజాగా ఒక సంగీత ఆల్బమ్‌ను రూపొందించారు. దాని పేరే ‘ఫేస్‌ ఆఫ్‌ ఇండియా’. వేల్స్‌ యూనివర్సిటీ అధినేత కే.గణేశ్‌తో కలిసి ప్రభుదేవా రూపొందించిన ఈ సంగీత ఆల్బమ్‌కు ఏజే దర్శకత్వం వహించారు.

దీని గురించి యూనిట్‌ వర్గాలు తెలుపుతూ గణతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ మూజికల్‌ ఆల్బమ్‌ గ్రామీణ పాటలతో మన దేశంలోని భిన్న సంస్కృతులను, భాషల ప్రాముఖ్యతలను ఆవిష్కరించేదిగా ఉంటుందన్నారు. తరుణ్, వికాశ్, వినోద్, అంజలి జయప్రకాశ్‌  నటించిన ఈ ఆల్బమ్‌కు దీపక్‌కుమార్‌పదీ ఛాయాగ్రహణం అందించారని చెప్పారు. ఈ ఆల్బమ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదే విధంగా ఆల్బమ్‌ టీజర్‌ను నటుడు ఆర్‌జే.బాలాజీ ఆవిష్కరించారు.