గ్లామరస్ తారగా ఓకే, సక్సెస్‌ మాత్రం లేదు !

“నువ్వు హీరోయిన్ కన్నా అందంగా ఉన్నావే” అన్న భామ స్టార్ హీరోయిన్ కాలేదు. “నువ్వు హీరోయిన్ ఎలా అవుతావు” అని హేళన చేసిన అమ్మాయి  అదృష్టం కలిసివస్తే స్టార్ హీరోయిన్ అయిపోతుంది. హీరోయిన్ల కెరీర్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు మంచి విజయం కోసం బాగా కష్టపడుతోంది. ఎప్పటినుండో సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. ఇటీవల వచ్చిన ‘నక్షత్రం’ సినిమా ప్రగ్యాకు విజయాన్ని అందించలేకపోయింది.

‘కంచె’ సినిమా తర్వాత చేసిన ‘మిర్చిలాంటి కుర్రోడు’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’ సినిమాలు చేసినా అవి తన కెరీర్‌ను పెద్దగా బూస్టప్ చేయలేదు. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నక్షత్రం’పై ప్రగ్యా జైస్వాల్ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఈ సినిమాలో ఆమె యాక్షన్ సీక్వెన్సులు కూడా చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా చేసి అదరగొట్టింది.  ఇందులో ప్రగ్య మితిమీరిన అందాల ఆరబోత యువకుల మతులు పోగొట్టింది. ఈ చిత్రం గ్లామరస్ తారగా ఆమెకు క్రేజ్‌ను తెచ్చిపెట్టిందే తప్ప… సక్సెస్‌ను మాత్రం అందించలేకపోయింది. అయితే ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో శుక్రవారం రాబోతున్న ‘జయ జానకి నాయక’ సినిమాపై ప్రగ్యా జైస్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా ఆమె నటించింది.