నాటక, సినీరంగాలలో ఎందరికో స్ఫూర్తి ప్రదాత నల్లూరన్న

అభ్యుదయ నాటక, సినీరంగాలలో ఎందరో నిలదొక్కుకునేలా చేసి, తన జీవితాన్నిఅంతా ప్రజాసేవకు, ‘ప్రజానాట్యమండలి’కి అంకితం చేసిన నల్లూరన్న (నల్లూరి వెంకటేశ్వర్లు) ఆదర్శప్రాయుడని పలువురు వక్తలు ప్రస్తుతించారు. ‘ప్రజానాట్యమండలి’ చలనచిత్రశాఖ నాయకులు వందేమాతరం శ్రీనివాస్, డా.మాదాల రవి, మద్దినేని రమేష్ తదితరుల సారధ్యంలో హైదరాబాద్ లోని ఫిలించాంబర్ లో ‘నల్లూరన్న’పుస్తక పరిచయం, అభినందన సభ జరిగాయి. తిరుపతి మిత్రులు నాగరాజు, పురుషోత్తం, మోహన్ రూపొందించిన నల్లూరన్న పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర సి.పి.ఐ. కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించి, తొలికాపీని గీత రచయిత సుద్దాల అశోక్ తేజకు అందించారు.
 
డా.మాదాల రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో గోపీచంద్, సీనియర్ నటుడు గిరిబాబు, సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, ధవళసత్యం, ముత్యాల సుబ్బయ్య, పోకూరి బాబూరావు, భీమనేని శ్రీనివాసరావు, చైతన్యప్రసాద్, సీపీఐ నాయకులు కె.ప్రతాప్ రెడ్డి తదితరులంతా నల్లూరన్న నీతి, నిజాయితీలను, నిబద్దతను శ్లాఘించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అందరూ ఆయనను అన్నగా ఆప్యాయతతో సంభోదిస్తారని అన్నారు. కేవలం ఒక్క ప్రకాశం జిల్లావారే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోని వాళ్లు నల్లూరన్నఅంటూ ప్రేమగా పిలిచే వ్యక్తి ఆయన అని కొనియాడారు. ఆయన నీడలో ఎందరో పెరిగి గొప్పస్థాయికి చేరుకున్నారని చెప్పారు. కమ్యూనిస్టు భావలను పూర్తిగా ఆకళింపు చేసుకోవడమే కాదు వాటిని పూర్తిగా తన జీవితంలోకి అన్వయించుకున్నవ్యక్తి ఆయన. ఆ రోజుల్లో మాదాల రంగారావు, టి.కృష్ణ, పోకూరి బాబూరావు, ఎం.వి.ఎస్.హరనాథరావు వంటి ఎందరితోనో కలిసి అభ్యుదయ నాటకాల్లో పాల్గొని, వారు సినిమారంగంలోకి వెళ్లేందుకు ఉత్తేజితులను గావించడంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. నేటికీ ప్రజాజీవితంలో తరిస్తున్న నల్లూరన్న లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్లు చాలా అరుదుగా ఉన్నారని వారు పేర్కొన్నారు.
 
వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ….తనను పెంచి పెద్ద చేసిన నల్లూరన్న తనకు తండ్రితో సమానమని అన్నారు.
చివరగా నల్లూరన్న మాట్లాడుతూ….. నటన పట్ల ఆసక్తి పుట్టుకతోనే వస్తుందని, ఇంతమంది వివిధ శాఖలలో రాణిస్తున్నారంటే అది వారికి ఇష్టమేనని అన్నారు.తన చివరి శ్వాసవరకుప్రజాజీవితంలో ఇలా నిజాయితీగానే బతుకుతానని అన్నారు. తనను గురువు అనడం కంటే ఇలా అన్నగా, మిత్రుడిగా సంభోదిస్తేనే ఇష్టపడతానని చెప్పారు. ఈ సమావేశంలో నల్లూరన్నతో పాటు కె.ప్రతాప్ రెడ్డికి కూడా సత్కారం జరిగింది.