అందుకే ఎటువంటి డూప్ లేకుండా న‌టించా !

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం  `ప్రేమ రెయిన్ చెక్`. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తు న్నారు. అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7 న విడుద‌ల అవుతుంది.
ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ప్రియా వ‌డ్ల‌మాని పాత్రికేయుల‌తో మాట్లాడుతూ ….
“నాది హైద‌రాబాద్‌. మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా ఓ సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే కొన్ని కార‌ణాల‌తో ఆ సినిమా ఆగిపోయింది. త‌ర్వాతే ‘ప్రేమ‌కు రెయిన్ చెక్’ సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ఇందులో నేను చాలా సైలెంట్‌గా ఉండే పాత్ర‌లో న‌టించాను. త‌న ప్ర‌పంచంలో తాను ఉండే హీరోయిన్‌. ఇప్ప‌టి అమ్మాయి అంటే ప‌బ్‌ల‌కు, పార్టీల‌కు వెళ్ల‌డ‌మే కాదు.. మంచి సహృద‌యురాలై ఉంటుంది. జీవితంలో కొన్ని విలువ‌లుంటాయి. విదేశాల్లో చదువుకోవాల‌ని ఉన్నా.. త‌ల్లిదండ్రుల‌పై ఆధార‌ప‌డ‌కుండా చ‌దువుకోవాల‌ని అనుకుంటుంది. నిజ జీవితంలో నేను కూడా కామ్‌గానే ఉంటాను. నా రియ‌ల్ లైఫ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌. నాకు అడ్వేంచ‌ర్స్ అంటే ఇష్టం. అందుకే ఎటువంటి డూప్ లేకుండా నేనే న‌టించాను. అందుకు కారణం ఈ సినిమాలో నేను అడ్వెంచ‌రెస్ విష‌యాల‌ను హ్యాండిల్ చేసే కంపెనీలో ప‌నిచేస్తుంటాను. కాబ‌ట్టి క్యారెక్ట‌ర్ ప‌రంగా అడ్వెంచ‌ర‌స్ థింగ్స్ చేయాల్సి ఉంటుంది. కాబ‌ట్టి అడ్వెంచ‌ర‌స్ విష‌యాల‌ను డూప్ లేకుండా చేశాను. ఇది ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీలా ఉంటుంది కానీ.. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ కాదు. సాధార‌ణంగా మ‌నం ఎవ‌రికైనా స‌హాయం చేసిన‌ప్పుడు..వారు మ‌న‌కు వెంట‌నే స‌హాయం చేయాలంటే..వెంట‌నే స‌హాయం తీసుకోకుండా.. ఇప్పుడు కాదు.. నేను అడిగిన‌ప్పుడు స‌హాయం చెయ్ అనడాన్ని రెయిన్ చెక్ అంటారు. ఇక టైటిల్ విష‌యానికి వ‌స్తే.. ఇందులో హీరో ఆఫీస్ వ్య‌వ‌హారాల‌కు, ప్రేమికురాలికి లింక్ ఉండ‌కూడ‌ద‌నుకునే వ్య‌క్తి. అందుక‌నే.. ఈ సినిమాకు ప్రేమ‌కు రెయిన్ చెక్ అనే టైటిల్‌ను పెట్టాం. డైరెక్ట‌ర్ ఆకెళ్ళ పేరి శ్రీనివాస్‌గారు చ‌క్క‌గా అంద‌రి నుండి త‌న‌కు కావాల్సిన న‌ట‌న రాబ‌ట్టుకున్నారు. సినిమా ప్రారంభానికి ముందే ఒక‌టిన్న‌ర నెల ముందు నుండి వ‌ర్క్‌షాప్స్ చేయ‌డం వ‌ల్ల సుల‌భంగా న‌టించ‌గలిగాను“ అన్నారు.