అవకాశమొస్తే సినిమాకు దర్శకత్వం చేస్తా !

‘శతమానం భవతి’ నాయిక అనుపమ పరమేశ్వరన్‌కు తెర వెనక దర్శకత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకత ఎప్పటి నుంచో ఉందట. అందుకే తాను కథానాయికగా నటిస్తున్న ‘మణియారాయిలే అశోకన్‌’ అనే మలయాళ చిత్రానికి సహాయ దర్శకురాలిగా అవతారమెత్తింది. నటనలో ఎంతగా జీవిస్తుందో.. అదే స్థాయిలో సహ దర్శకురాలిగా పనిచేస్తోంది… “స్వతహాగా నాకు దర్శకత్వంపై ఇష్టం ఉంది. కానీ హీరోయిన్‌గా బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అందుకే ఈ సినిమాకు వచ్చిన అవకాశాన్నిఇలా వినియోగించుకుంటున్నా. నా దృష్టిలో స్క్రీన్‌పై కనిపించే అద్భుత దృశ్యం తాలూకు మ్యాజిక్‌ అంతా తెర వెనకే సృష్టించబడుతుంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు.. నిర్మాణానంతర కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకున్నా. ఎంతో ఇష్టపడి పనిచేశాను కాబట్టి.. సెట్‌లో ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు. నా తొలిచిత్రం ‘ప్రేమమ్‌’ నుంచి దర్శకత్వ విభాగంలో పనిచేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు ఆ కల నెరవేరింది. భవిష్యత్తులో అవకాశమొస్తే సినిమాకు దర్శకత్వం చేస్తా’ అని ఎంతో ధీమాతో చెప్పింది అందాల యువ తార అనుపమ పరమేశ్వరన్‌.
 
మనసు గాయపడటం వల్లే…
అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించే అనుపమా పరమేశ్వరన్ మలయాళీ ముద్దుగుమ్మ . సొంత భాషలో మూడు సినిమాలే చేసింది. ఇప్పుడు ఇంకొకటి చేస్తోంది. నిజానికి అనుకున్నంత వేగంగా లేదామె కెరీర్. మంచి నటిగా పేరున్నా అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇదే ప్రశ్న రీసెంట్‌‌‌‌గా ఆమెని అడిగారొకరు. దానికి అనుపమ చెప్పిన విషయం విని అందరూ షాకయ్యారు. తన మనసు గాయపడటం వల్లే మాలీవుడ్‌‌‌‌కి అనుపమ దూరంగా ఉందట…
‘‘నేను తొలిసారి ‘ప్రేమమ్’ లో చిన్న పాత్ర చేశాను. ఆ సినిమా రిలీజ్‌‌‌‌కి ముందు ప్రమోషన్‌‌‌‌కోసం చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. దాంతో అందరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నానని అన్నారు. లెక్క చేయకపోవడంతో నాకు అహంకారం అని ట్రోల్ చేశారు. అందరూ అలా అనేసరికి చాలా హర్టయ్యాను. అప్పటికి మరీ చిన్నదాన్ని కదా. అందుకే కొన్నాళ్లు మలయాళ సినిమాలకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తమిళ,తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టాను. అప్పుడే ‘అఆ’ సినిమాలో నెగెటివ్ రోల్ చేయమని ఆఫర్ వచ్చింది. భాష రాకపోయినా.. తెలుసుకుని మరీ ఆ క్యారెకర్ చేశాను. తెలియని దాంట్లోవేలు పెడుతున్నావని అప్పుడు కూడా అందరూ ట్రోల్ చేసారు. అయినా చాలెంజింగ్‌‌‌‌గా తీసుకుని చేశాను. తర్వాత నా కెరీర్ మలుపు తిరిగింది’ అంటూ తనెంత పట్టుదలతో ఇండస్ట్రీలో నిలబడిందో చెప్పుకొచ్చింది అనుపమ.
 
’18 పేజెస్’ లో నిఖిల్ తో…
అనుపమ పరమేశ్వర్ యువ హీరో నిఖిల్ తో త్వరలో జతకట్టనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు, దర్శకుడు సుకుమార్ తాజగా ’18 పేజెస్’ అనే చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ‘కుమారి 21 ఎఫ్’ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.