దేశ గౌరవాన్నిపెంచాడీ క్రియేటివ్ జీనియస్‌

హీరోగా ప్రేక్షకుల్లో గొప్ప ఇమేజ్ సంపాయించడం  కాదు,  నటునిగా  ఏం సాధించావనేదే ప్రధానం . స్టార్ డమ్  వచ్చినా ఎప్పుడూ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలే చెయ్యడానికే మన హీరోలు మొగ్గుతుంటారు తప్ప నటుడిగా పేరుతెచ్చుకోవడానికి వైవిధ్యమైన పాత్రలు చెయ్యరు మన హీరోలు . వారిలో  భిన్నమైన వాడు అమీర్ ఖాన్.  అమీర్ ఖాన్ బాలీవుడ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ఉన్న నటుడు. ఇప్పటికే ఆయన చేసిన ఎన్నో సినిమాలు దీనిని నిరూపించాయి. కానీ ఈ సంవత్సరం లో అతని గొప్పతనం ఏమిటో మరొక్కసారి నిరూపితమైంది. క్రియేటివ్ జీనియస్‌గా అమీర్ ఖాన్ ఈ సంవత్సరం గొప్ప గుర్తింపు పొందాడు.
‘ఒక సినిమాలో అమీర్ ఖాన్ చేస్తున్నాడు’ అని తెలిస్తే చాలు.. ప్రేక్షకులందరికీ ఆ సినిమాని తప్పకుండా చూడాలి అనేంతగా బాక్సాఫీస్ వద్ద అమీర్ ఖాన్ సృజనాత్మక శక్తి ప్రభావం చూపిస్తుంది. టికెట్ కొనుక్కుని సినిమాకి వెళితే.. మంచి అనుభూతితో బయటికి వస్తాం.. అనేలా అమీర్ ఖాన్ సినిమాలు ప్రేక్షకుల మైండ్ సెట్‌లో బలంగా నాటుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే కేవలం అమీర్ ఖాన్ ఉన్నాడనే సినిమాకి వచ్చే వాళ్లు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరి దీనిని అమీర్ ఖాన్ మ్యాజిక్ అనక ఇంకేం అంటారు.
గత ఏడాది చివర్లో ఆయన నటించి, నిర్మించిన ‘దంగల్’ అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో మహావీర్ సింగ్ ఫోగత్ కథను తెరకెక్కించాడు. ఈ పాత్రలో అమీర్ ఖాన్ నటన అద్భుతం అనేలా నటించాడు. గీతా మరియు బబితలకు శిక్షణ ఇచ్చే పాత్రలో ఆయన నటన అందరినీ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ప్రపంచంలోని మొదటి భారతీయ మహిళా మల్లయోధురాలికి శిక్షణ ఇచ్చే పాత్ర ఆయనది. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ రికార్డులను భారతదేశంలోనే కాకుండా, చైనాలో దాని మ్యాజిక్ చూపించి కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక ఈ ఏడాది తను చేసిన సినిమా ‘సీక్రెట్ సూపర్‌స్టార్’. ‘గాయనిగా మారాలనుకునే ఓ యువతికి తల్లి మద్ధతు ఉన్నప్పటికీ, సంప్రదాయాలంటూ తండ్రి అందుకు అడ్డుగా నిలవడం’ అనే కాన్సెఫ్ట్‌తో ఈ కథ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిజ జీవిత పాత్రని మరిపిస్తూ ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాడు. ఈ చిత్రం తన గత చిత్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన చిత్రం. అద్వైత్ చందన్‌కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అలాగే హీరోయిన్ జైరా వసీంకి ఇది రెండో చిత్రం. కథ సామాన్యమైన కథే. చిత్ర టీమ్ అంతా కొత్తదే అయినా ఒక్క అమీర్ ఖాన్ అనే పేరుతోనే ఈ చిత్రం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతేకాదు 2017వ సంవత్సరానికి గానూ సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రం అత్యంత లాభదాయకమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 2017 బాలీవుడ్ విషయానికి వస్తే అతి తక్కువ చిత్రాలే బిజినెస్‌ని పర్‌ఫెక్ట్‌గా చేశాయి. అందులో ఈ సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రం కూడా ఒకటి. ఈ చిత్రంతో 2007లో వచ్చిన ‘తారే జమీన్ పర్’ చిత్ర మ్యాజిక్‌ని అమీర్ మళ్లీ రిపీట్ చేశాడనంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.