అందుకే డిగ్రీ తర్వాత పూర్తిగా సినిమాలే !

‘ఒరు అడార్‌ లవ్‌’ సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేశారు. అయితే ఆమె నటిగా కంటే చదువుకుంటేనే బాగుంటుందని తన టీచర్లు అభిప్రాయపడుతున్నారట. ఈ విషయాన్ని ప్రియ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు… ‘చదువును మధ్యలోనే ఆపాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పలేదు. అలా చేయడం వారికి ఇష్టం లేదు. మరో ఏడాది లో డిగ్రీ పట్టా అందుకుంటాను. అప్పుడు పూర్తిగా సినిమాలపై దృష్టిసారించవచ్చు. నాకు చదువు చెప్పిన టీచర్ల అభిప్రాయం ఏంటంటే.. నేను నటన కంటే చదువులోనే చురుకుగా ఉంటానని అంటున్నారు. నటన ఆపేసి చదువుపై దృష్టిసారించాలని చెబుతున్నారు. అది వారికి నాపై ఉన్న అభిమానం. కానీ నాకు నటన అంటేనే ఇష్టం. నేనేమీ ఫస్ట్‌క్లాస్ స్టూడెంట్‌ని కాను. కాలేజ్‌కి వెళుతున్నందుకు గ్రేస్‌ మార్కులు కూడా పడవు’ అని తెలిపారు.
 
తన తొలి సహ నటుడు రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌ గురించి మాట్లాడుతూ.. ‘మా ఇద్దరితో మరో సినిమా చేయాలని చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇంకా ఏదీ ఫైనలైజ్‌ అవ్వలేదు. మేం నటించిన ‘ఒరు అడార్‌ లవ్’ సినిమా గురించి కూడా ఎన్నో వదంతులు వచ్చాయి. నా వల్లే మళ్లీ సినిమాను రీషూట్‌ చేశారని అంటున్నారు. అందులో నిజం లేదు. రోషన్‌, నూరిన్‌ షెరీఫ్‌తో పాటు నాకు కూడా సమాన నిడివి ఉన్న పాత్రను ఇవ్వాలనుకున్నారు. నేను ‘కన్నుగీటే’ పాట హిట్టవడంతో చిత్రబృందం నిర్ణయించుకున్నట్లుగా నా పాత్ర నిడివిని కాస్త పెంచారు. అంతేకానీ నా వల్ల ఎవరి పాత్రల నిడివిని తగ్గించలేదు’ అని వెల్లడించారు ప్రియ
 
కించపరచాలనే ఉద్దేశం లేదు !
ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రసాద్‌ మాంపుళ్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీదేవి బంగ్లా చిత్రంలో నటిస్తుంది. అయితే నిర్మాణం పూర్తి కాకముందే ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం.’శ్రీదేవి బంగ్లా’ చిత్రంలో నటి శ్రీదేవికి సంబంధించిన చర్చనీయాంశ సన్నివేశాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరగడంతో ఆమె కుటుంబసభ్యులు ఇప్పటికే ఈ చిత్రం పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. శ్రీదేవి బంగ్లా చిత్రాన్ని చట్టబద్ధంగా అడ్డుకుంటామని శ్రీదేవి భర్త బోనీకపూర్‌ ప్రకటించారు.
 
ఈ వివాదంపై నటి ప్రియా ప్రకాశ్‌ స్పందిస్తూ …ఇటీవల ఒక వీడియోను విడుదల చేసింది. అందులో.. శ్రీదేవి బంగ్లా చిత్రం నటి శ్రీదేవి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్నది కాదని స్పష్టం చేసింది. ఈ చిత్రానికి ఆమెకు ఎలాంటి సబంధం ఉండదని అంది. శ్రీదేవి జీవిత చరిత్రనో, ఆమె మరణం సంఘటనలతోనో చిత్రాన్ని రూపొందించి ఆమె కుటుంబం మనోభావాలను కించపరచాలన్నది తమ అభిమతం కాదని అంది. శ్రీదేవికి కళంకం ఆపాదించాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొంది.’శ్రీదేవి బంగ్లా’ పూర్తిగా సాధారణ సస్పెన్స్, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. అయితే ఈ చిత్ర టైటిల్‌ను నిర్ణయించడం, శ్రీదేవి మరణించడం ఒకే సమయంలో జరగడం యాదృచ్చికమేనని చెప్పింది. అందుకే ఇంత దూమారం చెలరేగుతోందని ప్రియాప్రకాశ్‌ పేర్కొంది