చిరాకెత్తించే యూత్ చిత్రం… ‘లవర్స్ డే’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2/5 

సుఖీభ‌వ సినిమాస్‌ బ్యానర్ పై ఒమ‌ర్ లులు దర్శకత్వంలో ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధాంశం…
రోష‌న్ (రోష‌న్‌), ప్రియా వారియ‌ర్‌, గాథా జాన్ అంద‌రూ డాన్ బాస్కో హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్లో చ‌దువుతుంటారు. ప్రియ‌ను ఆట‌ప‌ట్టించాల‌ని రోష‌న్ ఆమెను టీజ్ చేస్తాడు. క్ర‌మంగా అది వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌కు దారి తీస్తుంది. వాళ్లిద్ద‌రూ ప్రేమించుకుంటున్న విష‌యం స్కూల్లో అంద‌రికీ తెలిసిపోతుంది. ఒకానొక స‌మ‌యంలో రోష‌న్ ఫ్రెండ్ చేసిన చిన్న త‌ప్పు వ‌ల్ల రోష‌న్ ప్రిన్సిపాల్ ముందు దోషిగా నిలుచోవ‌ల‌సి వ‌స్తుంది. అయితే ఆ స‌మ‌యంలో ప్రియ అత‌నికి స‌పోర్ట్ చేయ‌దు. ముందు నుంచీ అత‌నికి స‌పోర్ట్ చేసే గాథ స‌పోర్ట్ చేస్తుంది. వారిద్ద‌రు క‌లిసి ప్రియ‌ను ఉడికించాల‌ని ప్రేమ‌ను న‌టిస్తారు. అయితే న‌ట‌న‌గా మొద‌లుపెట్టిన వారి ప్రేమ నిజ‌మ‌వుతుంది. గాథ‌, రోష‌న్ ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకున్నారా?ప్రియ‌, రోష‌న్ మ‌ధ్య ప్రేమ ఏమైంది? అనేది ఈ సినిమాలో చూడాలి…
విశ్లేషణ…
ఒక్క కన్నుగీటుతో ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. ఆ క్రేజ్ తో ఈ సినిమా పై అంచనాలను పెరిగాయి.దర్శకుడు ఒమర్ కొత్తవారితో యూత్ ని టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమాలో… స్నేహం, ప్రేమ విలువను వాటి మధ్య తేడాను చెప్పే ప్రయత్నంలో కథను తెర మీదకు ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా సాగతీత సీన్లతో నవ్వు రాని రొటీన్ కామెడీతో నడిపితే, సెకెండ్ హాఫ్ లో ప్లో లేని సన్నివేశాలతో సినిమాని చాలా బోరింగ్ గా నడిపారు.అసలు కథలోని మెయిన్ పాయింట్ సెకెండ్ హాఫ్ లో గాని ప్రారంభం అవ్వదు.
స్కూల్లో ప్రియ‌, రోష‌న్ మ‌ధ్య స‌ర‌దాగా మొద‌లైన ప్రేమలో ఎక్క‌డా డెప్త్ గా ఉండ‌దు. ప్రియా కన్ను కొట్టినా, రోష‌న్ ఆమెకు ముద్దు పెట్టినా విడివిడిగా క్లిప్స్ సోష‌ల్ మీడియాలో చూడ్డానికి బాగానే ఉన్నాయి. కానీ సినిమాల్లో వాటిని చ‌క్క‌గా వాడుకోలేక‌పోయారు. కెమిస్ట్రీ సార్‌కీ, మ్యాథ్స్ సార్‌కీ, పీటీ సార్‌కి మ‌ధ్య సాగే డిస్క‌ష‌న్స్ లోనూ న‌వ్వులు రాలేదు. స్కూల్లో జ‌రిగే చిన్న గొడ‌వ పోలీస్ స్టేష‌న్‌కు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చిందో, ప్రిన్సిప‌ల్‌ను పోలీసులు ఎందుకు భ‌య‌పెడుతారో లాజిక్ ఉండ‌దు. స‌న్నివేశాలు ఆక‌ట్టుకోవు. క్లైమాక్స్ మాత్రం ఆలోచింప‌జేసేలా ఉంది.
నటవర్గం…
అంచనాలను పెంచేసిన  ప్రియా వారియర్ ఆ అంచనాలను అందుకోలేకపోయినా… ఉన్నంతలో తన స్క్రీన్ ప్రెజెన్స్, తన గ్లామర్ తో పర్వాలేదనిపిస్తోంది. ముఖ్యంగా ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంట మధ్య వచ్చే సన్నివేశాలు.. అలాగే వారి మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.అదేవిధంగా మరో హీరోయిన్ గా నటించిన నూరిన్ షెరిఫ్‌ తన గ్లామర్ తో పాటుగా తన నటనతోనూ మెప్పిస్తుంది. ముఖ్యంగా హీరోకు ఆమెకు మధ్య వచ్చే సీన్లతో పాటు ఎమోషనల్ సాగే క్లైమాక్స్ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా బాగా నటించింది.
సాంకేతిక వర్గం…
షాన్ రెహ‌మాన్‌ అందించిన తొమ్మిది పాటల్లో రెండు పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తొమ్మిదో పాట చాలా బాగుంది.  నేపధ్య సంగీతం ఒక మాదిరిగా సాగింది. అస‌లు టైటిల్స్ ప‌డేట‌ప్పుడు వ‌చ్చే నేప‌థ్య సంగీత‌మే ప్లెజెంట్‌గా అనిపించ‌దు.  టోట‌ల్‌గా సంగీతం సినిమాకు ప్ల‌స్ పాయింట్ కాలేక‌పోయింది.ఎడిటర్ అచ్చు విజ‌య‌న్‌ పనితనం పెద్దగా చూపించినట్లు అనిపించదు. నిర్మాణ విలువలుఅంతంత మాత్రం గానే ఉన్నాయి – రాజేష్