అలా చేస్తే.. డిమాండ్‌ చేసే స్థాయికి వెళ్తాం!

“సమస్యలు ఎదురైనప్పుడు ‘మన బలం ఏంటి? ’ అని ఆలోచిస్తా. ఆ బలం తెలుసుకుని, ఆ దిశగా వర్కవుట్‌ చేయడం మొదలుపెడతా”… అని ప్రియాంక చోప్రా చెప్పింది. “నా ముఖం మీదే తలుపులేసిన సందర్భాలున్నాయి.. అప్పుడు నేనేం కుంగిపోలేదు. మనల్ని మనం నిరూపించుకుంటే.. మనం డిమాండ్‌ చేసే స్థాయికి వెళ్తాం.. అని నమ్మాను. అలా నిరూపించుకోవడానికి కష్టపడ్డాను. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానో.. అదే చేస్తున్నాను.ఏ రంగంలోనైనా మన లక్ష్యాల్ని సాధించాలంటే.. సవాళ్ళని ఇష్టపడాలి. అలా ఇష్టపడితే, అనుకున్న గోల్స్‌ని రీచ్‌ కావడం పెద్ద కష్టమేమి కాదు.జీవితంలో నేను నమ్మేదేంటంటే..’ప్రతి ఫెయిల్యూర్‌ని సవాల్‌గా తీసుకుని ఎదగాలని’.
 
జీవితం చాలా నేర్పిస్తుంది. ఒడిదుడుకులను దాటుకుంటూ ఈదమని చెబుతుంది. అలాంటి క్లిష్టమైన సమయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్లాలి. పరిస్థితులు తలకిందులుగా ఉన్నప్పుడు మనం ఎలా లేవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది.. మనం ఫెయిల్యూర్‌ని ఎదుర్కోవాలి. ఎందుకంటే, ఒక అపజయం తర్వాత.. ‘మనం ఏం చేస్తున్నాం’ అనేది ముఖ్యం. మనకు మనమే ఆదర్శంగా నిలవాలి. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. మనల్ని మనం నమ్మాలి”
 
సవాల్‌ విసిరిన పాత్రలే …
” కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది నాకు సవాల్‌ విసిరిన పాత్రలే. అలాంటి పాత్రలంటే నాకెంతో ఇష్టం. వాటిలో నటిస్తున్నప్పుడు చాలా విషయాల్ని మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. మొదట్లో ఈ తరహా పాత్రలో నటిస్తున్నప్పుడు చాలా భయపడేదాన్ని. పాత్రకు నేను న్యాయం చేయగలనా లేదా..అని భయంగా ఉండేది. క్రమంగా నన్ను ఛాలెంజ్‌ చేసే పాత్రల్ని ఇష్టపడటం ప్రారంభించాను . అంతే, అప్పట్నుంచి ఏ తరహా పాత్రనైనా అవలీలగా చేసేస్తున్నా” అని ప్రియాంక చెప్పింది.
 
“నాకెప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, కొత్త పనులు చేయాలన్నా ఇష్టం. మీరు నా కెరీర్‌ని గమనిస్తే అది అర్థమవుతుంది. ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేసుకుంటూ వచ్చాను. ‘ఇలాంటి పాత్రలే చేయాలి’ అనే హద్దులను నటిగా చెరిపేయాలనుకున్నాను. నిర్మాతగా కూడా జస్ట్‌ కమర్షియల్‌ చిత్రాలకే పరిమితం కాదల్చుకోలేదు. మా పర్పుల్‌ పెబెల్‌ పిక్చర్స్‌పై తీసిన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్‌’కి మూడు నేషనల్‌ అవార్డులు వచ్చాయి. ఇంకా పంజాబీ, భోజ్‌పురి భాషల్లో కూడా మంచి సినిమాలు నిర్మించాం. ఇప్పుడు చిత్రపరిశ్రమ, ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. కొత్త సినిమాలను చూడ్డానికి ఆడియన్స్‌ ఇష్టపడుతున్నారు. వరల్డ్‌ సినిమాల్లో మనం ఉండటానికి ఇదే మంచి సమయం అని భావిస్తున్నాను”..అని ప్రియాంక చెప్పింది.
 
ప్రియాంక చోప్రా రీసెంట్‌గా ‘ది స్క్రై ఈజ్‌ పింక్‌’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసింది. ‘ఛేజింగ్‌ హ్యాపినెస్‌’ అనే డాక్యుమెంటరీలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. జాన్‌ లార్డ్‌ టేలర్‌ దర్శకత్వంలో ఈ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు.