ఇండస్ట్రీలోని ప్రతీవారికీ ‘అంకుల్’ ఉంటారు !

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో విడుదల కానున్న హిందీ సినిమా ‘భారత్’లో ప్రియాంక కీలకపాత్ర పోషించారు. ఇటీవల ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అనుభవాలను వెల్లడించారు……

‘నేను 15 ఏళ్ల క్రితం బాలీవుడ్‌లో కాలుమోపాను. అయితే ఇండస్ట్రీలోని ప్రతీవారికీ ‘అంకుల్’ ఉంటారు. లేదా ఎవరి సంతానమో అయి ఉంటారు. అస్సలు ఎటువంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేనివారు ప్రొడక్షన్ హౌస్‌లోకి ప్రవేశించడం చాలా కష్టం. అయితే నాకు మిస్ వరల్డ్ కిరీటం లభించాక బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. అయితే కెరియర్ ప్రారంభంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పట్లో నాకు బాలీవుడ్‌లో ఎవరూ తెలియదు. ఎవరిని చూసినా వారు ఎవరికో ఒకరికి బంధువైవుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ స్థానం సంపాదించుకోవడం కష్టమైంది. మొదట్లో అవకాశాలు వచ్చినప్పటికీ, నన్ను ప్రాజెక్టు నుంచి ఎప్పుడు తప్పిస్తారోనని భయపడేదానిని’ అని తెలిపింది.

తల్లి పాత్రను ఓ ఛాలెంజ్‌గా ….

తల్లి పాత్రలో ప్రియాంకా చోప్రా కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. హీరోయిన్‌గా స్టార్‌ స్టేటస్‌తో దూసుకెళ్తున్నవారు తల్లి పాత్రలో నటించేందుకు అంతగా ఆసక్తి చూపరు. అయితే.. ఇందుకు కొందరు మినహాయింపు. పాత్ర నచ్చాలే కానీ చాలెంజింగ్‌గా తీసుకుని నటిస్తారు. ఇప్పుడు ప్రియాంక కూడా తల్లి పాత్రను ఓ చాలెంజ్‌గా తీసుకోబోతున్నారట. ఆ మధ్య వరుస హాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల బాలీవుడ్‌ సినిమాలు చేస్తున్నారు.

ప్రస్తుతం  సల్మాన్‌ఖాన్‌తో ‘భరత్‌’ చిత్రంలో నటిస్తున్నారు ప్రియాంక. ఆ సినిమా తర్వాత సోనాలి బోస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో 18 ఏళ్ల కూతురికి తల్లిగా నటించనున్నారట ఈ బ్యూటీ. అయేషా చౌదరి అనే యువతి 18 ఏళ్లకే ‘ఇమ్యునోడెఫిషియన్సీ’ వ్యాధితో (రోగ నిరోదక శక్తి లోపించడం) మృతి చెందారట. ఆమె జీవితం ఆధారంగానే ఈ సినిమా ఉండనుందని సమాచారం. అయేషా పాత్రలో ‘దంగల్‌’ ఫేమ్‌ జైరా వసీమ్‌ నటించనుండగా, ఆమె తల్లిగా ప్రియాంక నటిస్తారట. ఈ చిత్రంలో ప్రియాంక భర్తగా అభిషేక్‌ బచ్చన్‌ కనిపించనున్నారట.