మహిళా దర్శకురాలితో మరో చిత్రం !

‘భాజీ ఆన్‌ ద బీచ్‌’, ‘బెండ్‌ ఇట్‌ లైక్‌ బెకహేమ్‌’, ‘బ్రైడ్‌ అండ్‌ ప్రిజుడీస్‌’, ‘ఇట్స్‌ ఏ వండర్‌ఫుల్‌ ఆఫ్టర్‌ లైఫ్‌’ వంటి చిత్రాలతో అభిరుచిగల దర్శక, నిర్మాతగా జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ గురీందర్‌ చదా గుర్తింపు పొందారు. ఇటీవల ‘వైస్రాయ్ హౌస్‌’ చిత్రంతో అంతర్జాతీయ ప్రేక్షకుల ముందుకొచ్చిన నటి, దర్శక,నిర్మాత గురీందర్‌ చదా తాజాగా ప్రియాంక చోప్రాతో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రియాంక చోప్రాతో రూపొందించే చిత్రానికి గురీందర్‌ కేవలం దర్శకత్వం మాత్రమే వహిస్తారు. ఈచిత్రాన్ని ప్రియాంక తన సొంత బ్యానర్‌లో నిర్మించేందుకు సూత్ర ప్రాయంగా గ్రీన్‌సిగ్నల్  ఇచ్చినట్టు తెలుస్తోంది.

‘బెండ్‌ ఇట్‌ లైక్‌ బెకహేమ్‌’ చిత్ర సీక్వెల్‌ను ప్రియాంకతో చేయబోతున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు గురీందర్‌ సమాధానమిస్తూ… ‘తొలుత నేను కూడా అలాగే అనుకున్నాను. కాని ప్రియాంక దీన్ని కాకుండా మరో ప్రాజెక్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అది కూడా 2012 సంవత్సరంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన ఓ నాటకం ఆధారంగా సినిమా ఉండాలని ఆశిస్తున్నారు. ఆమె కోరిన రీతిలోనే స్క్రిప్ట్‌ ప్రిపేర్‌ చేసేందుకు రెడీగా ఉన్నాను. ఇటీవల కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రియాంక తల్లి  మధు చోప్రాని కలిసి ప్రాజెక్ట్‌ విషయం చర్చించినప్పుడు, ఆమె కూడా సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు’ అని చెప్పారు.

ప్రియాంక ప్రస్తుతం ‘ఏ కిడ్‌ లైక్‌ జేక్‌’ హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తూనే పలు భాషల్లో దాదాపు డజన్‌కి పైగా చిత్రాలను నిర్మిస్తూ బిజీగా ఉంది. దీంతోపాటు అరుంధతీరాయ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కబోయే వ్యోమగామి  కల్పనాచావ్లా బయోపిక్‌లోను, అమృతా ప్రీతమ్‌గా భన్సాలీ రూపొందించబోయే ‘గుస్తాఖియాన్‌’, ‘ఈజ్‌ నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ చిత్రంలోనూ నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.