పోటీ కారణంగానే ఈ అసూయ, ద్వేషాలు !

చిత్రపరిశ్రమలో రెండు ద్వంద్వ ప్రమాణాలు కొనసాగుతున్నాయంటూ ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మండిపడ్డారు. ఇద్దరు హీరోయిన్లు కలసి ఒక సినిమాలో నటిస్తే వారి మధ్య కీచులాటలు ఉన్నాయని, వారి మధ్య సఖ్యత లేదని పత్రికలు రాస్తాయని, అదే ఇద్దరు హీరోలు కలసి నటిస్తే వారి మధ్య స్నేహబంధం వెల్లివిరిసిందని, వారిద్దరూ ఎంతో అవగాహనతో నటించారని రాస్తాయని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ఒక అందాల పోటీకి హాజరైన ప్రియాంక చోప్రా ఓవెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో నిర్మొహమాటంగా నిప్పులు చెరిగారు…
 
నన్ను ఇంటర్వూ చేసే జర్నలిస్టులు మీరు ఆ హీరోయిన్‌తో కలసి నటిస్తున్నారు కదా.ఆమెతో మీకు గొడవలేమైనా జరిగాయా..సెట్స్‌లో మీరిద్దరూ మాట్లాడుకుంటారా? అని అడుగుతుంటారు. అదే హీరోల విషయానికి వచ్చేసరికి ఆ ఇద్దరు నటులు చక్కని అవగాహనతో నటించారంటూ డబ్బా కొట్టేస్తుంటారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు అంటూ ప్రియాంక రుసరుసలాడారు. దీనికి ప్రధాన కారణం ఫిలిమ్ ఇండస్ట్రీలో మహిళలకు అవకాశాలు చాలా తక్కువని, హీరోలతో పోలిస్తే హీరోయిన్లు చాలా తక్కువ సమయంలోనే తెరమరుగవుతారని ఆమె చెప్పారు. అందుకే హీరోయిన్లు అవకాశాల కోసం పోటీపడుతుంటారని, ఈ పోటీ కారణంగానే అసూయ, ద్వేషాలు ఏర్పడతాయని ఆమె అన్నారు. మహిళలు ఏ ఇండస్ట్రీలో ఉన్నా అవకాశాలు తామే సృష్టించుకోవాలని, అప్పుడే మహిళల మధ్య స్నేహబాంధవ్యాలు ఏర్పడతాయని ఆమె అభిపాయపడ్డారు
ప్రియాంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్‌ చేయాలంటే
ప్రియాంకా చోప్రా కు ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 4 కోట్ల 30 లక్షల ఫాలోయర్స్‌ ఉన్నారు.సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్‌ హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా ఒకరు. ట్విటర్‌లో దాదాపు 2 కోట్ల 50 లక్షల ఫాలోయర్స్‌ ఉన్నారు. సెలబ్రీటీలు తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన వాటికి ఎంత చార్జ్‌ చేస్తారనే అంశం ఆధారంగా యూఎస్‌కు చెందిన ఓ కంపెనీ విడుదల చేసిన ‘ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌ లిస్ట్‌’లో ప్రియాంకా చోప్రా 19వ స్థానంలో నిలిచారు.
 
ఏదైనా ప్రొడక్ట్‌ను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా ప్రమోట్‌ చేయడానికి ప్రియాంకా చోప్రా దాదాపు కోటీ 86 లక్షల 80 వేల రూపాయలు తీసుకుంటారట. ఆ కంపెనీ విడుదల చేసిన వందమంది జాబితాలో ఉన్న ప్రముఖుల్లో అమెరికన్‌ మోడల్‌ కైలీ జెన్నర్‌ తొలి స్థానంలో నిలిచారు. అలాగే ఈ జాబితాలో చోటు సంపాదించిన ఒకేఒక్క బాలీవుడ్‌ నటి కూడా ప్రియాంకే కావడం విశేషం. అలాగే ఇండియా తరఫున విరాట్‌ కోహ్లీ 23వ స్థానంలో నిలవడం విశేషం.