తల్లి పాత్రతో సహా నాలుగు విభిన్నమైన గెటప్స్ లో…

ప్రియాంక చోప్రా… ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ తాజా షెడ్యూల్‌ ప్రారంభంలో లండ‌న్‌ వీదుల్లో ప్రియాంక ‘గ‌ణ‌ప‌తి బ‌ప్ప మోరియా’ అంటూ కెమెరా ముందు కొబ్బ‌రి కాయ ప‌గుల‌గొట్టింది. రెండేళ్ళ త‌ర్వాత హిందీ సినిమాలో స‌ల్మాన్‌తో క‌లిసి ‘భార‌త్‌’లో న‌టించాల్సి ఉన్నా ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. దీంతో ప్రియాంక స్థానంలో క‌త్రినాని క‌థానాయిక‌గా తీసుకున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటిస్తుంది ప్రియాంక‌. ఇందులో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆ పాత్ర‌లు ప్రేక్ష‌కుల మ‌తులు పోగొట్టేలా ఉంటాయ‌ని అంటున్నారు.
 
సోనాలి బోస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో జైరా వ‌సీమ్ కూడా ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుంది. ప్రియాంక త‌ల్లిగా జ‌రీనా న‌టిస్తుంది. ఈ సినిమా రెండో షెడ్యూల్ ఇటీవల ముంబైలో ముగిసింది. తాజా షెడ్యూల్‌ని లండ‌న్‌లో ప్రారంభించేందుకు యూనిట్ సిద్ధ‌మైంది. అయితే తాను చేసే ప్ర‌తి ప‌నికి ముందు ప్రియాంకకు వినాయ‌కుడిని పూజించ‌డం అల‌వాటు. ఈ క్ర‌మంలోనే ‘గ‌ణ‌ప‌తి బ‌ప్ప మోరియా’ అంటూ కెమెరా ముందు కొబ్బ‌రి కాయ ప‌గుల‌గొట్టింది. ఆ త‌ర్వాత కొబ్బ‌రి నీళ్ళ‌ని చిత్ర యూనిట్‌కి సంబంధించిన వారిపై జ‌ల్లింది. ఇక గ‌ణేషుని ఆశీస్సుల‌తో చిత్రంకి ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌ద‌ని ప్రియాంక భావించింది. అయితే ఈ తతంగానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.
 
చిన్న వయసులో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అసలు బ్రతకడమే కష్టమని డాక్టర్స్‌ చెప్పినా మోటివేషనల్‌ స్పీకర్‌గా, ఒక పుస్తక రచయితగా కూడా తన ప్రతిభ చాటుకున్న అయేషా చౌదరి కథని తీసుకొని ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం . అయేషా పాత్ర‌లో జైరా క‌నిపించ‌నుండ‌గా, వయ‌సులోని వివిధ ద‌శ‌ల‌లో ప్రియాంక గెటప్స్ ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. స్పూర్తినిచ్చే చిత్రంగా ఈ మూవీ ఉంటుంద‌ని అంటున్నారు. ప్రియాంక హాలీవుడ్ చిత్రం ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ విడుద‌ల‌కి సిద్ధం కాగా, ‘ఏ కిడ్ లైక్ జేక్’ చిత్రం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే.