ప్రేమ‌ కలిసిన మన దేశ రుచుల‌ను అందిస్తా !

ప్రియాంక చోప్రా ‘క్వాంటికో’ సీరియ‌ల్‌తో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకొని అక్క‌డే సెటిల్ అయింది. ఈ మ‌ధ్య బాంద్రాలోని త‌న ఫ్లాట్ కూడా అమ్మేస్తే… దానిని జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ‘సిటాడెల్’ షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా త‌ను న్యూయార్క్ లో రెస్టారెంట్ ఓన‌ర్ అయిన‌ట్టు ప్ర‌క‌టించింది…

భారతీయ భోజనాన్ని అందించాల‌నే ఉద్ధేశంతో తాను ‘సోనా’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించిన‌ట్టు ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. అంతేకాదు, పూజా కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసింది. “సోనాను చూపించ‌డాన్ని థ్రిల్‌గా ఫీల‌వుతున్నాను. కొత్త రెస్టారెంట్‌లో ‘ప్రేమ‌తో కూడిన ఇండియ‌న్ ఆహారం అందించాలి’ అని అనుకుంటున్నాను. చిన్న‌ప్పటి నుండి నేను తిన్న ఫుడ్, అద్భుతమైన వంటకాలు మంచి చెఫ్ చేతుల మీదుగా రెడీ అవుతున్నాయి. నా దేశ రుచుల‌ను ఈ రెస్టారెంట్‌లో చూస్తారు. ఏప్రిల్‌లో దీని ఓపెనింగ్ ఉంటుంది. మనీశ్ గోయెల్, డేవిడ్ ర్యాబిన్ లీడర్ షిప్ తోనే ఇదంతా సాధ్యమైంది. డిజైనర్ మెలిస్సా బోయర్స్ కు థ్యాంక్స్” అంటూ పోస్ట్ పెట్టింది ప్రియాంక‌.

స్వజాతీయులే నాకు ఆటంకాలు సృష్టించారు!… ఇటీవ‌ల ‘అన్‌ఫినిషిడ్’ బుక్‌ని రిలీజ్ చేసిన ప్రియాంక ప‌లు సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో ప్రియాంకచోప్రా అగ్ర కథానాయికగా ఎదిగిన అనంతరం హాలీవుడ్‌ తో  ‘గ్లోబల్‌స్టార్’‌గా పేరు తెచ్చుకుంది. తన సినీ ప్రయాణాన్ని అక్షరీకరిస్తూ ప్రియాంకచోప్రా ‘అన్‌ఫినిష్డ్‌’ పేరుతో రాసిన పుస్తకం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ పుస్తకంలో తాను కెరీర్‌ తొలినాళ్లలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, అవమానాల గురించి నిర్మొహమాటంగా అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. పురుషాధిక్య హిందీ చిత్రసీమలో రాణించడం అంత సులభం కాదని, ధృడసంకల్పంతో ప్రయాణాన్ని సాగించానని ప్రియాంకచోప్రా పేర్కొంది.

ప్రియాంకచోప్రా.  అక్కడ ఎలాంటి సిఫార్సులు లేకున్నా స్వశక్తితో అవకాశాల్ని సొంతం చేసుకుంది. అయితే తన హాలీవుడ్‌ జర్నీ అనుకున్నంత సవ్యంగా జరగలేదని చెప్పింది ప్రియాంకచోప్రా..  అక్కడి ఇండస్ట్రీలోని వర్ణ వివక్ష కంటే దక్షిణాసియా సినీరంగం వారి నుంచే ఎక్కువ అవమానాల్ని ఎదుర్కొన్నానని చెప్పింది… “ఒకే జాతి, సంస్కృతిసంప్రదాయాల నేపథ్యం నుంచి వచ్చిన వారందరూ మనతో సఖ్యతను ప్రదర్శిస్తారనుకోవడం ఒట్టి భ్రమ. హాలీవుడ్‌లో స్వజాతీయులే నాకు ఆటంకాలు సృష్టించారు. ‘భారత్‌ నుంచి వచ్చి హాలీవుడ్‌లో తారగా వెలిగిపోవాలనుకోవడం తీరని కల’ అంటూ నిరుత్సాహపరిచేవారు. మనవారు నెగెటివ్‌గా ఆలోచిస్తారని ఊహించలేదు” అని చెప్పింది ప్రియాంకచోప్రా. “ఎన్ని కష్టాలొచ్చినా మన కలల వెంట పరుగు మాత్రం మానుకోవద్దు. అయితే ఏ వేదికమీదైనా ఆశావాదంతో ముందుకుసాగితే విజయం తప్పక వరిస్తుంది” అని చెప్పింది.