రికార్డు సృష్టించే నాయికా ప్రధాన చిత్రాన్ని చేయాలి !

అమెరికా టీవీ సిరీస్ క్వాంటికోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది ప్రియాంకచోప్రా. ప్రస్తుతం ఈ సుందరిని ‘గ్లోబల్‌స్టార్‌’గా అభివర్ణిస్తున్నారు. గత కొంత కాలంగా హాలీవుడ్ సినిమాలకే పరిమితమై పోయినప్పటికి హిందీ చిత్రసీమలో ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక నుంచి బాలీవుడ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తానని ప్రియాంకచోప్రా చెప్పింది. అయితే నాయికా ప్రధాన చిత్రాల రూపకల్పనలో బాలీవుడ్ ధోరణిలో మార్పురావాలని హితవు పలికింది. ఆమె మాట్లాడుతూ …హాలీవుడ్ చిత్రాలు చేయడం వల్ల ప్రపంచ సినిమాను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం దొరికింది. అక్కడ కథానాయిక ప్రధానంగా రూపొందిన ‘వండర్ ఉమెన్’ వంటి చిత్రాలు పలు రికార్డులను బద్దలు కొట్టాయి. హిందీలో ఆ తరహా హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ చిత్రాలు రావాలి. అప్పుడే కథానాయికలకు అగ్ర హీరోలతో సమానమైన గుర్తింపు లభిస్తుంది. బాలీవుడ్‌లో మహిళా ప్రధాన చిత్రాలనగానే ప్రయోగమో, సందేశమో అనుకుంటారు. ఆ మైండ్‌సెట్‌లో మార్పురావాలి. బాక్సాఫీస్ రికార్డులను సృష్టించే నాయిక ప్రధాన చిత్రాన్ని చేయాలన్నది నా జీవితకాల కోరిక అని పేర్కొంది. త్వరలో ఆమె సంజయ్‌లీలాభన్సాలీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనుంది.

ఐషా చౌదరీ జీవిత చిత్రం లో…. 

బాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తూనే ప్రియాంక చోప్రా ప్రాజెక్ట్‌ల విషయంలో స్పీడ్‌ పెంచేసింది. ఇటీవలే సల్మాన్‌ ‘భారత్‌’లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్  ఇచ్చిన ప్రియాంక తాజాగా అభిషేక్‌ బచ్చన్‌తో నటించేందుకు రెడీ అవుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘దోస్తానా’, ‘బ్లఫ్‌మాస్టర్‌’ చిత్రాలొచ్చాయి. అభిషేక్‌, ప్రియాంక కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రానికి ‘మార్గరేట్‌ విత్‌ స్ట్రా’ ఫేమ్‌ సోనాలి బోస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోటివేషనల్‌ స్పీకర్‌ ఐషా చౌదరీ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అతి తక్కువ వయసు(15ఏండ్లకే)లోనే మోటివేషనల్‌ స్పీకర్‌గా ఐషా పాపులర్‌ అయ్యింది. అయితే 13ఏండ్లలోనే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో 2015లో కన్నుమూసింది. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు సోనాలి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో ప్రియాంక, అభిషేక్‌ ఐషా తల్లీదండ్రులుగా నటించే అవకాశం ఉందట. ప్రియాంక ప్రస్తుతం ‘ఏ కిడ్‌ లైక్‌ జేక్‌’,  ‘ఈజ్‌ నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌?’ చిత్రాల్లో నటిస్తోంది