‘యంగ్‌ అండ్‌ ఫ్రీ’ పాటతో సర్‌ప్రైజ్‌ !

టెలివిజన్‌ సిరీస్‌ ‘క్వాంటికో’తో హాలీవుడ్‌ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించి, ‘బేవాచ్‌’ చిత్రంతో హాలీవుడ్‌ వెండితెర ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది ప్రియాంక చోప్రా. నటిగానే కాకుండా భిన్న ప్రాంతీయ భాషా చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇదంతా ఓ ఎత్తయితే, గాయనిగా కూడా తానేమిటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలవడం విశేషం. మధురమైన స్వరంతో పాటలు పాడి అలరించడమే కాకుండా ఆల్బమ్స్‌ కూడా చేసి అందర్ని ఆకట్టుకుంటోంది.

తాజాగా ఓ పాటను పాడి శ్రోతలకు, ఆమె అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చింది…. ‘యంగ్‌ అండ్‌ ఫ్రీ’ అంటూ సాగే పల్లవిగల పాటను ట్విట్టర్‌ వేదికగా ప్రియాంక అభిమానులతో పంచుకుంది. అంతేకాదు ఈ పాటను ఎక్కువగా శబ్దంతో వినమని ట్వీట్‌లో విన్నపం కూడా చేసింది. “ఓ ప్రయోగం.. రియాలిటీగా మారింది. తమ బృందం సరదాగా స్టూడియోలో కూర్చుని ఈ పాటను రాశా”మని ప్రియాంక తెలిపింది. రాచెల్‌ రాబిన్‌, టోబి గడ్‌, టైరోన్‌ విలియం గ్రిఫ్ఫిన్‌ జేఆర్‌ వంటి వారితో కలిసి ఆమె ఈ పాట రూపొందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ మ్యూజిక్‌ యాప్‌ సావన్‌లో అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే ప్రియాంక ప్రస్తుతం ‘ఏ కిడ్‌ లైక్‌ జేక్‌’, ‘ఈజ్‌నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌?’ వంటి రెండు హాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటిస్తోంది. వీటిల్లో ‘ఈజ్‌నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌?’ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను ప్రియాంక తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.