‘మిస్‌ వరల్డ్‌’ అందాలను చూపించకపోతే ఎలా?

చాలా మంది పాపులర్‌ స్టార్స్‌ తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై మాట్లాడారు. ఇంకా బయటపడని వారెందరో? మరోసారి ఈ లైంగిక వేధింపుల సమస్య హాట్‌టాపిక్‌గా నిలిచింది. గ్లోబర్‌స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా కూడా లైంగిక వేధింపులకు గురైందని తన తల్లి మధు చోప్రా పేర్కొంది. ముంబాయిలో బాలల చిత్రోత్సవాల్లో పాల్గొన్న ఆమె లైంగిక వేధింపులపై స్పందించారు…. ‘ఓ ప్రముఖ దర్శకుడి వేధింపుల వల్ల పది సినిమాలోను వదులుకోవాల్సి వచ్చింద’ని పేర్కొంది. ”ప్రియాంక బాలీవుడ్‌లోకి ప్రవేశించిన తొలి రోజుల్లో ఓ సినిమా కోసం షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు… ‘ ఓ ప్రముఖ దర్శకుడు పొట్టిగా అసభ్యంగా ఉన్న దుస్తులు వేసుకోవాలని చెప్పాడు’ అని కాస్ట్యూమ్‌ డిజైనర్‌ సూచించాడు. అంతేగాకుండా ఆ దర్శకుడు ఇలా కూడా అన్నాడు… ‘మిస్‌ వరల్డ్‌’ అయిన మీ అందాలను చూపించకపోతే ఎలా?’ అని అన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది ప్రియాంక. అలా ప్రాజెక్టు నుంచి మధ్యలో వచ్చేస్తే డబ్బులు చెల్లించాలి! అని తెలిసినా అవేవీ ప్రియాంక పట్టించుకోలేదు”అని మధు చోప్రా వివరించింది.

మరో సంఘటన గురించి చెబుతూ ” ప్రియాంక చిత్రసీమలోకి రావడం కొత్తే అయినా విలువలను పాటించేది. తనకు 17 ఏళ్ల వయసులో చిత్రసీమకు పరిచయమైంది. ప్రతీ నిమిషం తనకు నేను తోడుగా, వెంటే ఉండేదాన్ని. గత మూడేళ్ల వరకూ ప్రతీ క్షణం ఆమెతోనే ఉన్నా. ఓ దర్శకుడు కథ చెప్పడం కోసం మమ్మల్ని కలసినప్పుడు… ” నేనే మీకు కథ చెప్పినప్పుడు మీ అమ్మని బయట ఉండమని చెప్పండి” అని ప్రియాంకతో అన్నాడు. అప్పుడు ప్రియాంక స్పందించి.. ” మీరు చెప్పే కథ మా అమ్మ వినకపోతే ఆ సినిమాలో నేను నటించలేను” అని ఖరాకండి చెప్పేసింది” అని పేర్కొంది. ఈ విధంగా వేధింపుల వల్ల సుమారుగా పది సినిమాలను ప్రియాంక వదిలేసుకుందని చెప్పింది మధు చోప్రా. బాలీవుడ్‌ అనే కాదు హాలీవుడ్‌లోనూ ఇదే రకమైన వాతావరణం ఉందని ప్రియాంక చెప్పింది.