ఓ నటి జీవిత విశేషాలు చూపేందుకు మరో నటి తపన !

‘నా జీవితం ఆధారంగా రూపొందించే టెలివిజన్‌ సిరీస్‌ను ప్రియాంక చోప్రా నిర్మించడం కరెక్ట్’ అని అంటోంది మాధురీ దీక్షిత్‌. బాలీవుడ్‌లో బ్యూటిఫుల్‌ హీరోయిన్‌గా మాధురీ దీక్షిత్‌ ఎన్నో విజయవంతమైన వినోదాత్మక  చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె సినీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని అమెరికాలో ఓ టెలివిజన్‌ సిరీస్‌ను రూపొందించేందుకు మాధురీ భర్త శ్రీరామ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఆయన ప్రముఖ రచయిత అనే విషయం అందరికీ విదితమే. ప్రస్తుతం మాధురీపై తెరకెక్కించే సిరీస్‌ కోసం ఆయన స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఈ సందర్భంగా మాధురీ దీక్షిత్‌ మాట్లాడుతూ… ‘నాపై అమెరికాలో టెలివిజన్‌ సిరీస్‌ తీస్తానని గతేడాది శ్రీరామ్‌ చెప్పడం నాకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఇందులో నా సినీ జీవితంతోపాటు ఫ్యామిలీ లైఫ్‌ని కూడా ఆయన చూపించబోతున్నారు. అయితే ఈ సిరీస్‌ను సహనిర్మాతగా ప్రియాంక చోప్రా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి దీనికి ప్రియాంక పర్‌ఫెక్ట్‌ అని భావిస్తున్నా. ఓ నటి జీవిత విశేషాలను తెలియజేసేందుకు మరో నటి తపన పడటం బాలీవుడ్‌ చరిత్రలో ఇదే ప్రథమం అని అనుకుంటున్నాను’ అని తెలిపింది.

ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌లో ‘ఏ కిడ్‌ లైక్‌ జేక్‌’, ‘ఈజ్‌నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌?’ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్‌లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న ‘గుస్తాకియాన్‌’ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు వివిధ భాషల్లో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రియాంక సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.