ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్‌ల మధ్య రిలేషన్ కావాలి !

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ ఏడాది రూపొందించిన ‘శతమానం భవతి’, ‘నేను లోకల్’, ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’, ‘ఫిదా’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో వరుసగా ఐదు హిట్స్‌ సాధించిన నిర్మాత దిల్‌రాజు. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో రూపొందిన ‘ఎంసిఎ’తో డబుల్ హ్యాట్రిక్‌కు సిద్ధమవుతున్నారు.  దిల్‌రాజుపుట్టినరోజు డిసెంబర్ 18. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ… 

సక్సెస్, ఫెయిల్యూర్‌లను సమానంగా… 
ఇది నా 47వ పుట్టినరోజు. 1999లో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ను ప్రారంభించాం. కెరీర్‌లో 22 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూటర్‌గా, 14 సంవత్సరాలుగా నిర్మాతగా కొనసాగుతున్నాను. నిర్మాతగా 28 చిత్రాలు నిర్మిస్తే అందులో 22 సినిమాలు విజయాన్ని సాధించాయి. ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూటర్‌గా నాకు పెద్దగా కలిసిరాలేదు. నా భార్యను కోల్పోవడం ఎంతో బాధకలిగింది. అయితే నేను సక్సెస్, ఫెయిల్యూర్‌లను సమానంగా స్వీకరిస్తాను. ఈ ఏడాది నిర్మాతగా శతమానం భవతి, నేను లోకల్, డీజే దువ్వాడ జగన్నాథమ్, ఫిదా, రాజా ది గ్రేట్ చిత్రాలతో వరుసగా ఐదు విజయాలను సాధించి మంచి సక్సెస్‌ను అందుకున్నాను. అదే సమయంలో డిస్ట్రిబ్యూటర్‌గా కొంత నష్టపోయాను. నిర్మాతగా సక్సెస్‌ను సాధించడంతో డిస్ట్రిబ్యూటర్‌గా నష్టాన్ని తట్టుకోగలిగాను.

అన్నింటికీ దర్శకుడే బాధ్యుడు కాదు…
ఒక చిత్రం ఫెయిల్ అయిందంటే అది దర్శకుడికే చెందదు. ఉదాహరణకు వేణు శ్రీరామ్ దర్శకుడిగా ‘ఓ మై ఫ్రెండ్’ నిరాశపరిచింది. ఈ చిత్రాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించాలని అనుకున్నాం. ముందుగా నాలుగు కోట్ల బడ్జెట్‌తో కొత్తవారితో ఈ సినిమా చేయాలని అనుకోవడం జరిగింది. కానీ హీరోగా సిద్ధార్థ్‌తో పాటు ఇద్దరు స్టార్ హీరోయిన్‌లను తీసుకోవడంతో బడ్జెట్ పెరిగిపోయింది. అయితే ఈ చిత్రాన్ని కొత్తగా తీద్దామని దర్శకుడు అనుకున్నాడు. దీంతో చివరికి మేము అనుకున్న విధంగా సినిమా రాకపోవడంతో ‘ఓ మై ఫ్రెండ్’ సక్సెస్ కాలేదు. అలాగే ‘కృష్ణాష్టమి’ సినిమా విషయంలో ముందుగా అనుకున్న కథే వేరు. చివరికి హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా చేయాలనుకున్న సినిమా కాస్త హీరోయిక్ సినిమాగా మారిపోయింది. చివరికి ‘కృష్ణాష్టమి’ చిత్రానికి 10 కోట్ల నష్టం వచ్చింది. ఏడు కోట్లు నావి పోతే డిస్ట్రిబ్యూటర్ల్లకు మూడు కోట్ల నష్టం వచ్చింది. ‘జోష్’ కథ అనుకున్నప్పుడు సినిమాపై నాగార్జున అబ్బాయి సినిమా అనే ఇమేజ్ ఏర్పడింది. కాలేజీల్లో గొడవల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకోలేకపోయింది. ఇక ఓ చిత్రం సక్సెస్, ఫెయిల్యూర్ అంతా దర్శకుడిపైనే ఆధారపడి ఉండదు.

మారకపోతే వెనుకపడిపోతాం…
ప్రేక్షకులు ఎప్పుడూ మారుతుంటారు. ఈరోజు ప్రేక్షకుడికి టీవీ సీరియల్స్‌తో పాటు పలు రూపాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తోంది. వాటిని దాటుకొని ప్రేక్షకుడు థియేటర్‌కు రావాలంటే సినిమాలో ఏదైనా కొత్తదనం ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తాడు. ‘బాహుబలి’ వంటి చిత్రాలకు ప్రేక్షకుల ఆరదణ ఎప్పుడూ ఉంటుంది. ఇక ప్రేక్షకులకు అనుగుణంగా మనం కూడా మారాలి. లేకుంటే ఇండస్ట్రీలో వెనుకపడిపోతాం.

ఆరవ హిట్‌ను అందుకుంటాం….
మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంసిఎ’. ‘శతమానం భవతి’లో తల్లిదండ్రుల గురించి చెప్పాం. ‘ఫిదా’లో నాన్న, కూతురి గురించి చూపించాం. ఇప్పుడు వదిన, మరిదిల మధ్య అనుబంధం నేపథ్యంలో ‘ఎంసిఎ’ను తెరకెక్కించాం. సినిమాలో నాని, సాయిపల్లవి, భూమిక, విలన్ విజయ్‌వర్మ అద్భుతంగా నటించారు. ఈ చిత్రంతో ఈ ఏడాది ఆరవ హిట్‌ను అందుకుంటామన్న నమ్మకముంది. సినిమా ఫస్టాఫ్ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు లవ్ సీన్స్ ఉంటాయి. సెకండాఫ్‌లో ప్రధాన కథలోకి వెళ్తాం. ఇది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో చివరి 15 నిమిషాలు ఎంతో కీలకంగా ఉంటుంది.

పోటీని తట్టుకొని నిలబడ్డాం…
‘శతమానం భవతి’ చిత్రంతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించాం. ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకొని మంచి కలెక్షన్లతో విజయం సాధించింది. పెద్ద సినిమాల పోటీని తట్టుకొని నిలబడటమే కాకుండా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇక లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘నేను లోకల్’ చేసి విజయాన్ని అందుకున్నాను. అల్లుఅర్జున్‌తో చేసిన ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’ నిర్మాతగా నా 14 ఏళ్ల కెరీర్‌లో అత్యధికంగా లాభాలు తెచ్చిన చిత్రంగా నిలిచింది. వరుణ్‌తేజ్, సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఫిదా’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాం. ఇక రెండేళ్ల గ్యాప్ తర్వాత రవితేజ చేసిన ‘రాజా ది గ్రేట్’ కమర్షియల్‌గా మా బ్యానర్‌లో పెద్ద హిట్‌ను సాధించింది.

ప్రశంసలు, వివాదాలు… 
నేను నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా సినిమాల గురించి పూర్తిగా విశ్లేషిస్తుంటాను. ఈ ఏడాది నా ఐదు సినిమాలకు ప్రశంసలు రావడంతో పాటు వివాదాలను కూడా ఎదుర్కొన్నాను. డీజే సినిమా విషయంలో వివాదం వచ్చింది. నిర్మాతగా నా సినిమాను మేజర్ ఏరియాల్లో నేనే విడుదల చేస్తాను. నేను ముందుగా డిస్ట్రిబ్యూటర్‌ని. సినిమా విడుదల సమయంలో డిస్ట్రిబ్యూటర్‌కు ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు. నా ప్రతి సినిమాకు ముగ్గురు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు పక్కాగా ఉంటారు. నేను డిస్ట్రిబ్యూటర్ కావడం వల్ల ఏ ఏరియాలో ఎంత వస్తుందో నాకు తెలుసు. కానీ చాలా మంది ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని చెబుతుంటారు. ఆ విషయంలో మనల్ని మనం మోసం చేసుకోకూడదని నేను చెబుతుంటాను. కానీ వినడం లేదు. ఒకర్ని చూసి ఒకరు తప్పు చేస్తున్నారు. బాలీవుడ్ తరహాలో గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే చెప్పాలి.

నేను నేర్చుకున్నది అదే…
డిస్ట్రిబ్యూటర్ బావుంటేనే నిర్మాతకు మేలు జరుగుతుంది. నిర్మాతగా నా డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే. ఉదాహరణకు ఓ సినిమాను విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్‌కు కోటి రూపాయల నష్టం వస్తే… నిర్మాతగా నేను 30 నుండి 35 లక్షలు సహాయం చేస్తే డిస్ట్రిబ్యూటర్‌కు నాపై నమ్మకం ఉంటుంది. అలా కాకుండా డిస్ట్రిబ్యూటర్‌ను పట్టించుకోకపోతే నిర్మాతతో సంబంధం పోతుంది. సాధారణంగా సినిమా బిజినెస్ విషయంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌కు మధ్య అగ్రిమెంట్ ఉన్నా… దాన్ని మించిన సంబంధం ఉండాలి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్ నిర్మాతతో కలిసి ప్రయాణిస్తాడు. డిస్ట్రిబ్యూటర్ బతుకుతాడు. అలాగే సినిమా బడ్జెట్‌తో పోల్చినప్పుడు కలెక్షన్స్ బావుంటేనే అది సక్సెస్‌ఫుల్ సినిమా… లేదంటే అది ఫెయిల్యూర్ సినిమానే. ఈ ఏడాది నిర్మాతగా నేను నేర్చుకున్నది అదే.

పైరసీపై పోరాడాలి… 
చిత్ర పరిశ్రమ కాలానుగుణంగా మారుతోంది. ఒకప్పుడు వంద రోజులు ఆడిన సినిమాలు ఇప్పుడు మూడు వారాలు ఆడితే చాలనుకునే స్థితికి చేరుకున్నాం. ప్రేక్షకులు ఫాస్ట్‌గా ఉన్నప్పుడు మనం కూడా సినిమాను ఫాస్ట్‌గానే అందివ్వాలి. ఇప్పుడు సినిమా విడుదలైన రెండో రోజుకే పైరసీ సీడీ వచ్చేస్తోంది. పైరసీ సీడీని అంద రూ చూస్తున్నారు. పైరసీ సీడీ దొరుకుతున్నప్పుడు అ మెజాన్‌లో సినిమాను ప్రేక్షకుడు కొనుక్కొని చూస్తే తప్పేం టి? నిర్మాతగా డిజిటల్ రైట్స్ అమ్మడాన్ని ఆపమని చెప్పడం లేదు. దానికంటే ముందుగా పైరసీ రూపంలో పెద్ద దెబ్బ తగులుతోంది. ముందు దాన్ని ఆపాలి. పైరసీపై డిస్ట్రిబ్యూటర్, నిర్మాత కలిసి పోరాడాలి. ఓ నిర్మాత ఐదు కోట్లతో సినిమా తీస్తే శాటిటైట్ రైట్స్‌తో మూడు కోట్లు వస్తే మంచిదే కదా. నిర్మాతకు మేలు జరగడమే ముఖ్యం.

అప్పుడే మంచి సినిమాలు…
నవంబర్‌లో ఓ వారంలో 14 సినిమాలు రిలీజయ్యాయి. ఒక్క సినిమా కూడా ఆడలేదు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు ఆడగానే మా సినిమా లు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెబుతున్నారు. కానీ అవి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక నిరాశపరుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మా సినిమా ఎందుకు ఆడలేదు అని విశ్లేషించుకున్నప్పుడే భవిష్యత్తులో మంచి సినిమాలొస్తాయి.

తదుపరి చిత్రాలు…
మా బ్యానర్‌లో నెక్స్ రెండు సినిమాలు చేయబోతున్నాను. కొత్త దర్శకులతో ఈ సినిమాలు చేస్తున్నా. ‘అదే నువ్వు అదే నేను’ అనే టైటిల్‌తో శశి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా తెరకెక్కనుండగా, ఇంకో కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాను.