ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ దొరస్వామిరాజు కన్నుమూత!

టాలీవుడ్‌ సీనియర్‌ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వి.ఎం.సి అధినేత వి.దొరస్వామిరాజు సోమవారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజుల నుండి వయో భారంతో దొరస్వామిరాజు  ఆరోగ్యం క్షీణించింది. అనారోగ్యంతో ఆయన బంజారా హిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దొరస్వామి రాజు 1946 లో విజయ్ పురం మండలం వరదరాజు లు కండ్రిగ లో జన్మించారు. ఆయన భార్య నిర్మల 2008 లో కన్నుమూశారు. ఆయనకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు అమెరికాలో సెటిల్ అవ్వగా, కుమారుడు విజయ్ కుమార్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్ల్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలే పెళ్లాం వంటి సినిమాలను ఆయన నిర్మించారు. ఓ గొప్ప నిర్మాతగానే కాకుండా మంచి డిస్ట్రీబ్యూటర్‌గా కూడా ఆయన పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 1978లో రాయలసీమలో తిరుపతి పట్టణంలో ‘విజయమల్లేశ్వరి కంబైన్స్’ అంటే వి.ఎమ్.సి. పేరు మీద డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ప్రారంభించారు. ఈ సంస్థ చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితమై తొలుత యన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ‘సింహబలుడు’ చిత్రాన్ని విడుదల చేసింది. 1979లో యన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ‘డ్రైవర్ రాముడు’ తో తమ వి.ఎమ్.సి. సంస్థ ను గుంతకల్ కేంద్రంగా రాయలసీమ అంతటా విస్తరించారు. ఆ తరువాత “వేటగాడు, యుగంధర్, గజదొంగ, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి” వంటి విజయవంతమైన చిత్రాలను తమ వి.ఎమ్.సి. ద్వారా రాయలసీమలో విడుదల చేసి మంచి పేరు గడించింది. అప్పటి నుంచీ దొరస్వామి రాజును అందరూ వీఎమ్‌సీ దొరస్వామి రాజు అని పిలిచేవారు.దాదాపు సినిమాలు తెరకెక్కించారు. ఇక డిస్ట్రూబ్యూటర్‌గా అయితే అనేక సినిమాలను సీడెడ్ ఏరియాల్లో విడుదల చేశారు.

1994లో నగరి నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌, డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఇలా ఎన్నో పదవులను అలంకరించారు. కొంతకాలంగా నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న దొరస్వామిరాజు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.

పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల నివాళులు !

సీనియర్‌ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, వి.ఎం.సి అధినేత వి.దొరస్వామిరాజు మృతి తెలుగు సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

ఎన్నో విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన దొరస్వామి రాజు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దొరస్వామి రాజు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.   -తెలంగాణ సీఎం కేసీయార్

ఒక డిస్ట్రిబ్యూటర్‌గా దొరస్వామిరాజుగారు వెయ్యికి పైగానే సినిమాలను విడుదల చేశారు. అద్భుతమైన సినిమాలను నిర్మించారు. `సీతారామయ్య గారి మనవరాలు`, `అన్నమయ్య` వంటి కొన్ని ఆణిముత్యాలు ఆయన బ్యానర్ నుంచే వచ్చాయి. నా కెరీర్‌ను మార్చిన `సింహాద్రి` సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.  -రాజమౌళి 

దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాతగా, పంపిణీదారుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. `సింహాద్రి` చిత్ర విజయంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.   -ఎన్టీయార్

దొరస్వామి రాజుగారు అజాత శత్రువు. అందరికీ బంధువు. ఆయన ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన తీసిన `అన్నమయ్య` సినిమాకు దర్శకత్వం వహించే భాగ్యం నాకు కలిగింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.   -రాఘవేంద్రరావు 

ఒక డిస్ట్రిబ్యూటర్‌గా దొరస్వామి రాజుగారు ఎందరో నిర్మాతలకు సహాయం చేశారు. అలాగే మరపురాని చిత్రాలను నిర్మించారు. ఆయన లేకపోవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.    -నిర్మాత ఏఎమ్ రత్నం