త్వరలో ప్రియాంక చోప్రా జీవితంపై పుస్తకం

లోగడ వివిధ రంగాలలో రాణించిన ప్రముఖుల జీవితాలపై అనేక గ్రంథాలు వచ్చాయి. కాని సినీ రంగానికి సంబంధించిన వారివి తక్కువనే చెప్పాలి. ప్రముఖుల జీవితాల్ని గురించి తెలుసుకోవాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. వాళ్లు జీవితంలో పడిన కష్టాలు, సాధించిన విజయాలు ఎన్నో ఉంటాయి.  అందుకే ప్రముఖుల జీవితాలపై వేరే వాళ్లు రాసినవి, వాళ్లే తమకు తాముగా రాసుకున్నవీ చాలా పుస్తకాలే వచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లైఫ్ పై కూడా ఇప్పుడు ఓ పుస్తకం రాబోతోంది. అయితే దాన్ని ఆమె రాసుకోవడం లేదు. వేరే రచయిత రాస్తున్నాడు.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్ అసీం చాబ్రా త్వరలో ప్రియాంక చోప్రా జీవితం ఆధారంగా ఓ పుస్తకం రాయబోతున్నట్టు ప్రకటించాడు. గతంలో ఆయన బాలీవుడ్ నటుడు శశి కపూర్ జీవితకథను రాశాడు. `శశి కపూర్: ద హౌస్హోల్డర్, ద స్టార్` అనే టైటిల్ తో ఆ పుస్తకం వచ్చింది. ప్రియాంక జీవిత కథతో రానున్న పుస్తకంలో ప్రేమ, వ్యక్తిగత విషయాలు కాకుండా చిన్న ‘పట్టణంలో జన్మించిన బాలిక అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగింది?’ అనే అంశాలు పొందుపరుస్తారట. ఈ ఏడాది చివరిలో ప్రియాంక బయోగ్రఫీ బుక్ రిలీజ్ కానుందట . గ్లోబల్ ఇమేజ్  అందుకున్న ప్రియాంక చోప్రా జీవితంపై పుస్తకం రావడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.