ఆర్‌.నారాయణమూర్తి ‘అన్నదాత సుఖీభవ’ షూటింగ్‌ పూర్తి !

‘ఒకప్పుడు ‘అన్నదాత సుఖీభవ’ అన్నారు పెద్దలు. ఇప్పుడు ‘అన్నదాత దుఖీభవ’గా మారిపోతున్నాడు. ఈ పరిస్థితులు మారాలి’ అని అంటున్నారు నటుడు, దర్శక, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి. స్నేహ చిత్ర పతాకంపై ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ… ‘మా స్నేహ చిత్ర బ్యానర్‌పై రూపొందిస్తున్న 30వ చిత్రమిది. రైతు సమస్యలపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. అన్నం పెట్టే రైతును అనేక కష్టాలు చుట్టుముడుతున్నాయి. దేశానికి వెన్నెముఖలా నిలిచిన రైతన్న సంక్షేమాన్ని పట్టించుకునే నాదుడే లేడు. స్వాతంత్య్రం వచ్చి 70ఏండ్లు పూర్తయినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు.
ఇటీవల కాలంలో సుమారు 60వేల మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు సమస్యలకు ప్రభుత్వాలు పరిష్కారం చూపాలి. పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరగాలి. వారికి గిట్టుబాటు ధర కల్పించాలి. రైతు పెట్టిన పెట్టుబడిలో 50శాతం పెంచి, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి. రైతు సంక్షేమం కోసం చట్టాలు తేవాలి. ఈ ప్రభుత్వాలు కోట్లకు కోట్లు కార్పొరేట్లకు, పారిశ్రామిక వేత్తలకు రాయితీలిస్తున్నాయి. కోట్లకు కోట్లు రుణమాఫీ చేస్తున్నారు.
కాని చిన్నమొత్తంలోనే రైతులు చేసే అప్పులను మాత్రం మాఫీ చేయడం లేదు. పైగా రోడ్డుపైకి ఈడుస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి కల్పిస్తున్నారు. ఈ పరిస్థితులపై ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాను. షూటింగ్‌ పూర్తయ్యింది. ఖమ్మం, వరంగల్‌, ఉభయగోదావరి, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో సినిమాను చిత్రీకరించాం. వంగపండు ప్రసాదరావు, సుద్దాల అశోక్‌ తేజ, గద్దర్‌ పాటలు రాశారు. సినిమా చాలా బాగా వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నాను. నాకు ఎవరూ పోటీ లేరు. నాకు నేనే పోటీ’ అని అన్నారు.