వారి వేధింపుల వల్లే అందరికీ చెడ్డ పేరు !

నటిగా గుర్తింపు దక్కించుకునేందుకు హీరోయిన్ పాత్రను మాత్రమే కాకుండా ఎలాంటి పాత్రను అయినా చేస్తానంటూ చెప్పే నటి రాధిక ఆప్టే. ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లలో కీలక పాత్రలు చేస్తోంది . ఇదిలాఉండగా తాజాగా రాధిక ఆప్టే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొందరికి అవి రుచించకున్నా కూడా ఆమె మాటలు నూటికి నూరు శాతం నిజమంటూ సినీ వర్గాల వారు అంటున్నారు…
“చిత్ర పరిశ్రమలో ఆడవారు లైంగిక వేధింపులకు గురవుతున్న విషయం నిజమే. కానీ అది కాస్టింగ్ డైరెక్టర్స్ వల్లే ఎక్కువగా జరుగుతోంది.ఒక సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసే కాస్టింగ్ డైరెక్టర్స్ కొందరు నీచంగా ప్రవర్తిస్తారు. వారి వల్ల ఇండస్ట్రీలో అందరికీ చెడ్డ పేరు వస్తోంది”అని రాధిక ఆప్టే పేర్కొంది. ఇక హీరో హీరోయిన్ల పారితోషికం విషయంలో చాలా అంతరం ఉండటంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చపై కూడా ఈ భామ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసింది. “సల్మాన్‌ఖాన్ వంటి స్టార్ హీరోకు 200 కోట్ల రూపాయలు వసూలు చేయగల సత్తా ఉంది. అయితే నాలాంటి హీరోయిన్‌కు కోటి వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇద్దరు కూడా సమానంగా పారితోషికాన్ని ఎలా డిమాండ్ చేస్తారు.అది వారి మార్కెట్‌ని భట్టి ఉంటుంది. అందుకే హీరోయిన్ పారితోషికం కంటే హీరో కంటే తక్కువ అయినా నేనేమీ ఫీల్ కాను. అయితే హీరో హీరోయిన్ కాకుండా సినిమాలో నటించే ఇతర నటీనటుల విషయంలో సమాన ప్రాముఖ్యత ఉండాలి. మగ, ఆడ అనే తేడా లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులకు సమానంగా పారితోషికం ఇవ్వాలి”అని చెప్పింది రాధిక ఆప్టే
 
వాటికోసం వెయిట్‌ చేస్తున్నా!
‘చిత్ర పరిశ్రమలో బయటి వారు(ఔట్‌ సైడర్‌) అనే పదం నాకు నచ్చదు’ అని అంటోంది రాధికా ఆప్టే. ఆమె నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ మార్చిలో విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాధికా మాట్లాడుతూ… ‘నేను సమాంతర సినిమాలు చేయాలని, కమర్షియల్‌, కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు చేయాలని ప్రత్యేకంగా ప్లాన్‌ చేసుకోలేదు. మంచి పాత్రల్లో నటించాలనుకుంటున్నా. వాటికోసం వెయిట్‌ చేస్తున్నా. స్క్రిప్ట్‌, నా పాత్ర, దర్శకుడిని బట్టి సినిమాని ఎంచుకుంటా. ఇటీవల విడుదలైన ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ప్రతి సినిమాని ఇష్టపడేవారుంటారు, నచ్చని వారుంటారు. అది వారి అభిప్రాయం. నిర్మాణాత్మకమైన విమర్శ మంచిది.
తదుపరి చేస్తున్న ‘ది ఆశ్రమ్‌’ స్పై థ్రిల్లర్‌. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగుతుంది. మొదటి మహిళా వైర్‌లెస్‌ ఆపరేటర్‌ నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌ జీవితం ఆధారంగా రూపొందుతుంది. ఓ మంచి మహిళా ప్రధాన చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఇటీవల మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలు వస్తున్నాయి. అవి భారీ స్థాయిలో రావాలి.  అని చెప్పారు. ఇదిలా ఉంటే గతేడాది రాధికా నటించిన ‘అంధాదున్‌’ చిత్రం ఇటీవల చైనాలో విడుదలై విజయవంతంగా దూసుకుపోతుంది.ఇప్పటికే ఇది వంద కోట్లకుపైగా కలెక్షన్లని వసూలు చేయడం విశేషం.