నా రుణం తీర్చేసిన సౌత్ సినిమాకు రుణపడి ఉన్నా !

‘హాట్ బ్యూటీ’ రాధిక ఆప్టే… హీరోయిన్‌గా సౌత్‌లో బాలకృష్ణ ‘లెజెండ్’, ‘లయన్’.. రజినీకాంత్ ‘కబాలి’, రాంగోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ వంటి కొన్నిసినిమాలుచేసి…ఇప్పుడు బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న నటి రాధిక ఆప్టే. బోల్డ్ సినిమాలైనా, పద్దతైన పాత్రలైనా ఇట్టే ఒదిగిపోయి పాత్రకు పూర్తి న్యాయం చేస్తుంది ఈ భామ. ప్రస్తుతం ఆమె ఇంటర్నేషనల్ రేంజ్‌లో రూపొందుతున్న వెబ్ సిరీస్‌లలో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా, మోడల్‌గా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం చాలా బిజీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకోవడంతో పాటు ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉంది. ఇలాంటి రాధిక ఆప్టే ఒకప్పుడు విధ్యాభ్యాసం కోసం తీసుకున్న బ్యాంక్ రుణం తీర్చలేని పరిస్థితిని ఎదుర్కొందట.

“లండన్‌లో చదువుకునేందుకు తీసుకున్న బ్యాంక్ రుణం కట్టడానికి ఇబ్బంది పడేదాన్ని. ఈ సమయంలో నాకు సౌతిండియా నుండి సినీ ఆఫర్లు వచ్చాయి. ‘రక్త చరిత్ర’ సినిమాలో నటించడంతో నాకు ఆర్థిక వెసులుబాటు దక్కింది. దక్షిణాది సినిమాల్లో నటించిన సమయంలో వచ్చిన పారితోషికంతో బ్యాంక్ రుణం తీర్చేయడం జరిగింది. అందుకే నాకు సౌత్ సినిమాలు అంటే ప్రత్యేకమైన అభిమానం”అని రాధిక ఆప్టే చెప్పింది. అయితే గతంలో సౌత్ సినీ పరిశ్రమలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని… తెలుగు, తమిళ పరిశ్రమలో తనను వేధించారని ఈ భామ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో కంటే సౌత్ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌కౌచ్ చాలా ఎక్కువ అంటూ ఆరోపణలు చేసింది. అన్ని విధాలుగా ఆదుకున్న దక్షిణాదిపై అప్పుడు అన్ని ఆరోపణలు ఎందుకు చేశావని రాధికా ఆప్టేను కొందరు ప్రశ్నిస్తున్నారు.