డైరెక్టర్‌గా అవకాశం.. హాలీవుడ్‌ భారీ ఆఫర్లు

‘ది ఆశ్రమ్‌’, ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ వంటి ఇంగ్లీష్‌ చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టేకి లేటెస్ట్‌గా రెండు హాలీవుడ్‌ భారీ ఆఫర్స్‌ వచ్చాయట. హాలీవుడ్‌లో బాలీవుడ్‌ కథానాయికలు అవకాశాలు సాధించుకోవడం కొత్త కాదు. ఐశ్వర్యా రాయ్,ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె సహా కొందరు కథానాయికలు హాలీవుడ్‌ సినిమాల్లో మెరిసారు. తాజాగా ఈ జాబితాలో రాధికా ఆప్టే కూడా చేరింది . ‘జేమ్స్‌బాండ్‌’ సిరీస్‌లో ప్రస్తుతం 25వ చిత్రం ‘నో టైమ్‌ టు డై’ వస్తోంది. ఈచిత్రం కాస్టింగ్‌ డైరెక్టర్‌ ఓ కీలక పాత్ర కోసం రాధికని ఇటీవల ఆడిషన్‌ చేశారట. అలాగే మరో హాలీవుడ్‌ సిరీస్‌ ‘స్టార్‌వార్స్‌’ లో భాగంగా ప్రస్తుతం ‘స్టార్‌ వార్స్‌: ది రైజ్‌ ఆఫ్‌ స్కై వాకర్‌’ వస్తోంది.ఈ కొత్త సినిమా కోసం కాస్టింగ్‌ డైరెక్టరే వచ్చి తనని ఆడిషన్‌ చేసినట్టు రాధిక తెలిపారు. ఇలా రెండు హాలీవుడ్‌ బంపర్‌ ఆఫర్స్‌తో రాధిక బాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలిచారు. ‘రక్త చరిత్ర’, ‘లెజెండ్‌’, ‘లయన్‌’  చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాధిక.. ప్రస్తుతం కొన్ని బాలీవుడ్‌ చిత్రాలతోపాటు ‘నెట్‌ ఫ్లిక్స్‌’ కోసం వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.
దర్శకురాలిగా మారింది
రాధికా ఆప్టే ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కోసం దర్శకురాలిగా మారింది. దర్శకుడు చెప్పగానే పాత్రలో లీనమైపోయి హీరోయిన్‌గా ఇన్ని రోజులు చేసిన రాధికా ఆప్టే…తొలిసారి యాక్టర్స్‌ చేత నటింప జేసింది. ఆమె ఓ ముప్పై నిమిషాల షార్ట్‌ ఫిల్మ్‌ కోసం దర్శకురాలిగా మారింది. గుల్షన్‌ దేవయ్య, షహానా గోస్వామి ప్రధాన పాత్రధారులుగా ‘స్లీప్‌ వాకర్స్‌’ అనే ఓ 30 నిమిషాల సినిమాకు దర్శకత్వం వహించింది రాధికా ఆప్టే.
 
ఆ షార్ట్‌ ఫిల్మ్‌ గురించి రాధిక చెబుతూ.. ‘‘ఏదైనా కొత్తగా రాయాలనే తాపత్రయంలో ఏదో ప్రయత్నించాను. ఇది నిర్మాతలు లలిత, హనీ, అభిషేక్‌లకు నచ్చడంతో షార్ట్‌ ఫిల్మ్‌ చేస్తామని చెప్పారు. అలా నేను దర్శకురాలిగా మారడం అకస్మాత్తుగా జరిగిపోయింది. ఈ అనుభవంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్లీప్‌ వాకర్స్‌’ విడుదలైన తర్వాత ఎలాంటి స్పందన వస్తుందో? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ఇప్పుడు షార్ట్‌ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించిన రాధిక సినిమాను డైరెక్ట్‌ చేసే రోజు దగ్గరలోనే ఉంది.