ఈమెకు హాలీవుడ్‌ నుండి కబురొచ్చింది !

ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుంటున్నారు ఏం చేయాలన్నా రాధికా ఆప్టే. పరిసర ప్రాంతాలను క్లియర్‌గా అబ్జర్వ్‌ చేస్తున్నారు. ఎందుకిలా? అంటే.. ఓ సినిమా కోసం. అందులో ఆమె గూఢచారి అవతారం ఎత్తనున్నారు. ఒక యుద్ధ రహస్యాలను సేకరించే పని చేయనున్నారు. ప్రస్తుతం అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారామె. హాలీవుడ్‌లో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన లిడియా డీన్‌ పిల్చెర్‌ దర్శకత్వంలో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఉమెన్‌ క్యారెక్టర్స్‌ స్ట్రాంగ్‌గా ఉంటాయట. ఇందులో స్టానా కాటిక్, సారా మేగాన్‌ థామస్‌లతో పాటు రాధికా ఆప్టే నటించనున్నారు. లైనస్‌ రోచే, రోసిఫ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక బ్రిటిష్‌ ఆఫీసర్‌ ఇద్దరు అమ్మాయిలను స్పైలుగా ఫ్రాన్స్‌ పంపిస్తాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు అమ్మాయిలు వార్‌ సీక్రెట్స్‌ను ఎలా సేకరించారు? ఈ మిషన్‌లో వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? అన్నదే సినిమా కథనంగా ఉంటుందట. వైర్‌లెస్‌ ఆపరేటర్‌ను యూజ్‌ చేయడంలో మంచి ప్రతిభ ఉండి, ఇండియన్‌ యాక్సెంట్‌ ఉన్న నూర్‌ ఇనయాత్‌ ఖాన్‌ పాత్రలో రాధికా ఆప్టే కనిపించనున్నారు. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోనే హాలీవుడ్‌ చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు హిందీ, తమిళ, తెలుగులోనూ నటించిన రాధికాకు ఇప్పుడు హాలీవుడ్‌ నుంచి కబురొచ్చిందన్నమాట.