సాయం చేసేందుకు ఇదే స‌రైన స‌మ‌యం!

మ‌నం వ‌చ్చిన‌ప్పుడు ఏం తీసుకురాలేదు. పోయేట‌ప్పుడు ఏం తీసుకుపోం. ప్ర‌స్తుతం దేవాల‌యాలు అన్నీ మూసి ఉన్నాయి. దేవుడు అనే వాడు ఆక‌లితో అల‌మ‌టిస్తున్న వారితో ఉంటాడ‌ని నేను న‌మ్ముతున్నాను. నా ప్ర‌కారం, నేను దేవుడికి ఇస్తే అది ప్ర‌జ‌ల‌కి చేర‌దు. అదే ప్ర‌జ‌ల‌కి సాయం చేస్తే దేవుడికి త‌ప్ప‌క చేరుతుంది. దేవుడు నా ప‌క్క‌న కూర్చొని ప్ర‌జ‌ల‌కి సాయం చేయమ‌ని చెబుతున్నాడు. ఇదే సాయం చేసేందుకు స‌రైన స‌మ‌యం“…అని లారెన్స్ అన్నారు.
 
తెలుగు, త‌మిళం, హిందీ ప్రేక్ష‌కుల మ‌న‌సులు న‌టుడు, కొరియోగ్రాఫ‌ర్‌, ద‌ర్శ‌కుడు గా గెలుచుకున్నారు లారెన్స్. సామాజిక స్పృహ కూడా బాగా వున్న లారెన్స్‌ని ప్ర‌జ‌లు ఎంత‌గానో అభిమానిస్తారు. క‌రోనా వ‌ల‌న దేశం అత‌లాకుతలం అవుతున్న స‌మ‌యంలో మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సు చాటుకొని… రాఘ‌వ లారెన్స్ చేస్తున్న స‌హాయ కార్య‌క్ర‌మాల‌ని చూసి ఆయ‌న అభిమానులే కాదు, ప్ర‌జ‌లు కూడా ఆయ‌న‌ని దేవుడిలా కొలుస్తున్నారు. ఇప్ప‌టికే 4 కోట్ల విరాళాన్ని క‌రోనా స‌హాయార్ధంగా అందించిన లారెన్స్ పేద వారికి నిత్యావ‌స‌ర స‌రుకులు అందిస్తున్నారు.
 
ఈ సేవా కార్య‌క్ర‌మాల గురించి తెలుసుకున్న పాండిచ్చేరితో పాటు ఇత‌ర సినీ ఇండ‌స్ట్రీకి చెందిన యూనియ‌న్స్ లారెన్స్‌కి కాల్ చేసి సాయం కోరుతున్నారట‌. వారి ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న లారెన్స్… ‘చంద్ర‌ముఖి 2′ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ ఇవ్వాల‌ని భావించారు. కాని లాక్‌డౌన్ వ‌ల‌న సినిమాకి సంబంధించిన కొన్ని లీగ‌ల్ ఫార్మాలిటీస్ పూర్తి కాక‌పోవ‌డంతో వేరే ఆలోచ‌న చేస్తున్నారు.’ల‌క్ష్మీ బాంబ్’ చిత్రానికి సంబంధించి అందుకున్న రెమ్యున‌రేషన్‌తో పాటు… క‌దిరేశ‌న్ ఇచ్చిన అడ్వాన్స్ ల‌ని కొన్ని యూనియ‌న్స్‌కి పంపించినట్టు లారెన్స్ పేర్కొన్నారు. ‘ల‌క్ష్మీ బాంబ్’ చిత్రానికి సంబంధించిన పెండింగ్ పారితోషికాన్ని డైరెక్ట్‌గా పీఎం రిలీఫ్ ఫండ్‌కి పంపాల‌ని కోరారు లారెన్స్. “నాకు ఉన్నంత‌లో అంద‌రికి సాయం చేయాల‌ని భావిస్తున్నాను. రావ‌ల‌సిన మొత్తం కొంత ఉండ‌గా..అవి కూడా వ‌చ్చాక పాండిచ్చేరితో పాటు మిగ‌తా యూనియ‌న్స్ అంద‌రిని కూడా ఆదుకుంటాను” అని లారెన్స్ చెప్పారు.
 
‘చంద్రముఖి 2’ హీరోగా లారెన్స్
పదిహేనేళ్ల క్రితం రజనీకాంత్‌ హీరోగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రముఖి’ చిత్రం విశేష ప్రేక్షకాదరణ తో సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కనుంది. ‘చంద్రముఖి’ని డైరెక్ట్‌ చేసిన పి. వాసుయే సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ఈ రెండో భాగంలో నటించనున్నట్లు దర్శకనటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ తెలిపారు. ‘‘రజనీకాంత్‌గారి అనుమతితో పి. వాసుగారు దర్శకత్వం వహించనున్న ‘చంద్రముఖి 2’ చిత్రంలో నేను నటించబోతున్నాను. సన్‌ పిక్చర్స్‌ కళానిధి మారన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు’’ అని లారెన్స్‌ పేర్కొన్నారు.