రాఘవ లారెన్స్… సైడ్ డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత కొరియోగ్రాఫర్ స్థాయికి అక్కడి నుంచి దర్శకుడు, నటుడు, నిర్మాతగా వరుస విజయాలను సొంతం చేసుకుని తనదైన గుర్తింపును సాధించారు. తను సంపాదించిన డబ్బుని కేవలం తనకు, తన వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాలని కాకుండా సమాజంలో పేద వారి కోసం, ఆపన్నుల కోసం కూడా అని భావించి ఓ ట్రస్ట్ ను స్థాపించి తద్వారా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు. 60 మంది పిల్లలను పెంచటంతో పాటు వికలాంగులకు డాన్స్ నేర్పించటం, కరోనా సమయంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయటం, గుండె ఆపరేషన్స్ చేయించటం క్రమంగా ఆయన తన సేవా కార్యక్రమాలను పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన ఛారిటీకి ఎవరూ డబ్బులు ఇవ్వకండిని రిక్వెస్ట్ చేశారు. అలా చెప్పటానికి గల కారణమేంటనే దానిపై లారెన్స్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.
లారెన్స్ అందులో మాట్లాడుతూ ..”నా ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపొద్దు..నా పిల్లల్ని నేనే చూసుకుంటాను”.. అని కొన్ని రోజుల ముందు రిక్వెస్ట్ చేస్తూ నేను ఒక ట్వీట్ వేశాను. అందుకు కారణమేంటంటే… నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్ ను స్టార్ట్ చేశాను. అందులో 60 మంది పిల్లల్ని పెంచటం, వికలాంగులకు డాన్స్ నేర్పించటం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించటం వంటి కార్యక్రమాలను నిర్వహించాను. ఈ పనులన్నింటినీ నేను ఒక్కడినే చేయలేకపోయాను. అందుకనే ఇతరుల నుంచి సాయం కావాలని కోరాను. అప్పుడు రెండేళ్లకు ఒక సినిమానే చేసేవాడిని. కానీ ఇప్పుడు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాను. బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, నాకు నేనే చేయొచ్చు కదా, ఇతరులను ఎందుకు అడిగి చేయాలని నాకే అనిపించింది.
ఇతరులు సేవ కోసం ఇచ్చే డబ్బులను నేను పొగరుతో వద్దనటం లేదు. నాకు ఇచ్చే డబ్బులను మీకు దగ్గరలో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి సాయం చేయండి. వారికెంతో ఉపయోగపడుతుంది. వారికి చాలా మంది సాయం చేయరు. నేను ఎంత చెప్పినా కొందరైతే నాతో కలిసే సాయం చేస్తామని అంటున్నారు. చాలా సంతోషం. ఆర్థిక ఇబ్బందులో బాధపడేవారెవరో నేనే చెబుతాను. మీచేత్తో మీరే సాయం చేయండి. అది మీకు ఎంతో సాయాన్ని కలిగిస్తుంది ” అన్నారు.