రాఘవ లారెన్స్ కి హార్రరే అచ్చొచ్చింది !

లారెన్స్ ఓ ప్రయోగం చేయబోతున్నాడు. హారర్ సిరీస్‌లో ఇప్పటికే మూడు విజయవంతమైన చిత్రాలు తీసిన రాఘవ లారెన్స్ ఇప్పుడు నాలుగో సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం లారెన్స్ ఓ ప్రయోగం చేయబోతున్నాడు. రాఘవ లారెన్స్.. ఇప్పుడు దర్శకుడిగా బిజీ అవడానికి కారణమైన చిత్రం ‘ముని’. లారెన్స్ తెరకెక్కించిన మొట్టమొదటి హారర్ మూవీ. ఈ సినిమా దర్శకుడిగా లారెన్స్‌ను మరో మెట్టుపై నిలబెట్టింది. ఆ తర్వాత ‘కాంచన’, ‘గంగ’ చిత్రాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి విజయవంతమయ్యాయి. తెలుగులో కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు లారెన్స్ మరోసారి హారర్ ను టచ్ చేయబోతున్నాడు. ఇప్పుడు నాలుగో హారర్ మూవీని ఆరంభించాడు లారెన్స్. చెన్నైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా కోసం లారెన్స్ ఆరుగురు మ్యూజిక్ కంపోజర్స్‌తో బాణీలు కట్టించాడు. ప్రముఖ సంగీత కారుడు మాధవన్ కార్కీ కి సంబంధించిన మ్యూజిక్ ప్లాట్ పారమ్‌లో వివిధ గాయకులు కంపోజ్ చేసి ఆలపించిన పాటల్నిఈ తాజా చిత్రం కోసం వినియోగించనున్నారట.
 సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ తాజా హారర్ మూవీ లో ‘ముని’లో హీరోయిన్‌గా నటించిన వేదికతో పాటు తమిళ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఓవియా కూడా కథానాయికగా నటిస్తోంది. వీళ్లతో పాటు ‘కాంచన’ సిరీస్ లో రెగ్యులర్ గా నటిస్తున్న కోవై సరళ, శ్రీమాన్, దైవ దర్శినిలు కూడా ఇందులోనూ నటిస్తున్నారు. ముందుగా ఇందులో ఒక కథానాయికగా జ్యోతికను ఎంపిక చేశారు. అయితే బిగ్‌బాస్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఓవియాను ఆ స్థానంలో ఎన్నుకున్నారు. జనవరి, ఫిబ్రవరిలోగా చిత్రాన్ని పూర్తి చేసే ఆలోచనతో ఉన్నాడు దర్శకుడు రాఘవ లారెన్స్. గత మూడు చిత్రాల్లాగానే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.