పాతవాసనలతో ఇబ్బందిపెట్టిన ‘పెళ్లి సందD’

సినీ వినోదం రేటింగ్ : 2/5

‘పెళ్లి సందడి’  పాతికేళ్ల క్రితం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చి ఎంత విజయం సాధించిందో తెలిసిందే ! అదే టైటిల్‌తో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఇప్పుడు మరో సినిమా రావడం …ఆ చిత్రంలో హీరోగా నటించిన శ్రీకాంత్‌ తనయుడు రోష‌న్‌ ఈ చిత్రంలో హీరో కావడం మరో విశేషం. రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాఘవేంద్రరావు ఓ కీలక పాత్ర కూడా పోషించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, మాధవి కోవెలమూడి నిర్మించారు.

కధ…  వ‌శిష్ట (రాఘ‌వేంద్ర‌రావు) బాస్కెట్ బాల్ మాజీ ఛాంపియ‌న్‌. పిల్ల‌ల‌కు కోచింగ్ ఇస్తుంటాడు. అతని  క‌థని సినిమాగా తీయాల‌ని ఓ వ్య‌క్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) వ‌స్తాడు. త‌న‌కి క‌థ వివ‌రించే క్రమంలో సినిమా.. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అక్క‌డ వ‌శిష్ట (రోష‌న్‌)కి ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌ని ఆశ‌. ఓ పెళ్లిలో స‌హ‌స్ర (శ్రీ‌లీల‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న అల్ల‌రి, కొంటెత‌నం న‌చ్చుతాయి. స‌హ‌స్ర‌కి త‌న మ‌న‌సులోని మాట చెప్పాల‌నుకుంటాడు. `విధి బ‌ల‌మైన‌దైతే.. అది మ‌న‌ల్ని క‌లుపుతుంది.. ఇప్పుడు నేను నీకు క‌నిపించ‌కుండా పోతాను. మ‌నం క‌ల‌వాల‌ని దేవుడు రాసి పెట్టుంటే మ‌నం మ‌ళ్లీ క‌లుస్తాం` అని మాయ‌మైపోతుంది. యాధృచ్ఛికంగా రైల్వే స్టేష‌న్ లో స‌హ‌స్ర మ‌ళ్లీ క‌నిపిస్తుంది. కానీ అంత‌లోనే మాయం అవుతుంది. స‌హ‌స్ర మాటిమాటికీ వ‌శిష్ట‌కి ఎందుకు దూరం అవుతోంది? వీరు క‌లిశారా.. లేదా? అనేది సినిమాలో చూడాలి…

విశ్లేషణ… ‘ పెళ్లి సందD’ కుటుంబ కథా చిత్రమని  చెప్పారు. అయితే ఇందులో కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే భావోద్వేగ సన్నివేశాలు ఎక్కడా కనిపించలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించాలి అంటే.. బలమైన ఎమోషన్స్ ఉండాలి. ఆ సన్నివేశాలు వెండితెరపై పండాలి. అలాంటి స్క్రిప్ట్ రాసుకోవడంలో గౌరీ రోనంకి విఫలం అయ్యారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ చిత్రంలో ఆయన మార్క్‌ రొమాన్స్‌ కనిపించలేదు. దర్శకురాలి తడబాటు కనిపించింది. కథ, కథనం లో ఎలాంటి కొత్తదనం కనిపించలేదు.ఇక పెళ్లింట కామెడీ అయితే… మ‌రీ రొటీన్ గా ఉన్నాయి.కామెడీ సన్నివేశాలు కొన్ని బలవంతంగా ఇరికించనట్లు అనిపించింది. కామెడీ బలవంతంగా పెట్టినట్లు ఉన్నప్పటికీ బోరింగ్ కథ నుంచి కొంత రిలీఫ్ లా ఉంటుంది. రఘుబాబు, రావు రమేష్ కామెడీ డైలాగులతో మెప్పించే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాల సాగదీత ప్రేక్షకులకు పరీక్షగా మారుతుంది. క్లైమాక్స్ కి చేరే కొద్దీ.. అస‌హ‌నం పెరిగిపోతుంది.

నటీనటులు… హీరోహీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. రోషన్ తన పాత్రకు తగ్గట్లుగా మంచి నటన అందించడంలో.. హావభావాలు పండించడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే హీరోయిన్ శ్రీలీల బాగానే  నటించింది. హీరోయిన్ కి కూడా నటించే స్కోప్ దక్కలేదు. గ్లామర్ గా కనిపిస్తూ మెప్పించే ప్రయత్నం చేసింది. రాఘవేంద్రరావు నటించారు అనడం కంటే ‘కనిపించారు’ అంటే సరిపోతుంది. ప్రెస్ మీట్ల‌లో మాట్లాడిన‌ట్టు ఉంది త‌ప్ప‌.. న‌టించిన‌ట్టు అనిపించ‌లేదు. చివర్లో దీప్తి భటనాగర్ కూడా అతిథిగా ఒక సన్నివేశంలో కనిపించింది. సీనియర్‌ ఆర్టిస్ట్‌లంతా ఏదోలా చేసుకుంటువెళ్లారు.

శ్రీ‌ధ‌ర్ సిపాన డైలాగుల్లో ప్రాస ఎక్కువైంది. సునీల్‌ కుమార్‌ నామ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మంచి విజువల్స్ రాబట్టడంలో కెమెరామెన్ సక్సెస్ అయ్యారు. ఇక కీరవాణి సంగీతం ఓల్డ్ స్టైల్ లో ఇప్పటి ట్రెండ్ కి దూరంగా ఉంది. నేప‌థ్య సంగీతంలో  కీర‌వాణి విసిగించాడు – రాజేష్