అనుకున్నదొక్కటీ ..అయ్యింది ఒక్కటీ !

నటి రాయ్‌లక్ష్మీ ఎన్ని భాషల్లో నటించినా, పేరును తారుమారు చేసుకున్నా, రాశి మాత్రం మారకపోవడంతో తీవ్ర నిరాశకు గురయిందట. కోలీవుడ్‌ హీరోయిన్‌గా పరిచయం అయినా.. వచ్చిన అవకాశాన్ని వదలకుండా, గెస్ట్‌ అపియరెన్స్, ఐటమ్‌ సాంగ్స్‌, నటిగా ఎన్ని రకాల పాత్రలు చేయాలో అన్నీ చేసేసింది. అయినా ఏ తరహా పాత్ర రాయ్‌లక్ష్మీని స్టార్‌ నటిని చేయలేక పోయింది. అయినా అందుకు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకున్న హిందీ చిత్రం ‘జూలీ -2’ ఇటీవల విడుదలై దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది. ఈమె నిజానికి బాలీవుడ్‌ రంగప్రవేశానికి చాలా కాలంగా ప్రయత్నించి ‘జూలీ -2’ చిత్ర అవకాశాన్ని దక్కించుకుంది. మరో విషయం ఏమిటంటే… ఇది ఈ అమ్మడి అర్ధ శత చిత్రం. దక్షిణాదిలో అంతగా ఆశాజనకంగా లేకపోవడంతో జూలీ-2తో బాలీవుడ్‌లో సెటిల్‌ అయిపోదామని ఆశించిన రాయ్‌లక్ష్మీకి ఆ చిత్రం ఘోర నిరాశనే మిగిల్చింది.

ఈ చిత్రంలో అందాలు ఆర బోసినా ఫలితం దక్కలేదు. అయితే ఈమె నటనలో విమర్శించదగ్గ అంశం లేకపోయినా కథలోనే క్లారిటీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందీలో తెరకెక్కిన జూలీ -2 చిత్రాన్ని తమిళంలోనూ డబ్‌ చేసి విడుదల చేశారు. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం జరిగిన ఈ చిత్రం ఇప్పటికి కేవలం కోటి రూపాయలు మాత్రమే వసూలు చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో జూలీ-2ను ప్లాప్‌ చిత్రంగా పరిగణించేస్తున్నారు సినీ పండితులు. కాగా తన 50వ చిత్రం ఇలాంటి ఫలితాన్నివ్వడంతో నటి రాయ్‌లక్ష్మీ ‘అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ’అనుకుని తీవ్ర షాక్‌కు గురైందని తెలుస్తోంది.