అక్కడ ‘బహుబలి2’తో రాజమౌళికి భారీ పరాభవం !

ఎస్‌ ఎస్‌ రాజమౌళి సృష్టించిన కళాఖండం ‘బాహుబలి’ సిరీస్‌ ఇండియాలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. భారత బాక్సాఫీస్‌ వద్ద వేగంగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘బాహుబలి’ ది కంక్లూజన్‌ రికార్డు సృష్టించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 18 వందల కోట్లు వసూళ్లు చేసింది. హిందీ వర్షన్‌ ఇండియాతోపాలు విదేశాల్లోనూ భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ మధ్యే బాహుబలి-2 జపాన్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే, అక్కడ మాత్రం ‘బహుబలి’తో రాజమౌళికి ఊహించని షాక్‌ తగిలింది. ‘బాహుబలి-2’ చైనా వర్షన్‌ దారుణమైన ఫలితాన్ని రాబడుతోంది. ఇప్పటిదాకా కనీసం రూ. 100 కోట్లు కూడా వసూలు చేయకపోవటం విశేషం. అమీర్‌ ఖాన్‌ ‘దంగల్‌’ చిత్రం చైనాలో రూ. 1200 కోట్లు వసూలు చేయగా(ఫుల్‌ రన్‌లో).. ఇక్కడ యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకున్న  ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌’ చిత్రం సైతం రూ. 700 కోట్లు రాబట్టడం గమనార్హం.

బాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై విజయం సాధించిన ‘హిందీ మీడియం’ కూడా చైనాలో రూ. 200 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో ఇండియాలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘బాహుబలి-2’ కూడా మంచి వసూళ్లనే రాబడుతుందని రిలీజ్‌కు ముందు మేకర్లు భావించారు. ‘బాహుబలి’ మొదటి భాగం ఫలితం తేడా కొట్టడంతో జాగ్రత్త పడ్డ జక్కన్న… హాలీవుడ్ టెక్నీషియన్‌ విన్సెంట్ టబైల్లాన్‌ను రంగంలోకి దించారు. విన్సెంట్‌(‘ది ఇన్‌క్రిడబుల్ హల్క్’, ‘క్లాష్ ఆఫ్ ది టైటాన్స్’ చిత్రాల ఫేమ్‌) ఎడిటింగ్‌ వర్క్‌తో చిత్రం ‘బాహుబలి-2’ ష్యూర్‌ హిట్‌ అని అంతా భావించారు. కానీ, సీన్‌ ఇప్పుడు పూర్తిగా రివర్స్‌ కావటంతో ఖంగుతినటం రాజమౌళి,అతని నిర్మాతల వంతు అయ్యింది.మే 4వ తేదీన 7 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజైన ‘బాహుబలి-2’.. మంగళవారం వరకు చిత్రం రూ.63 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటిదాకా వచ్చిన వసూళ్లతో ‘త్రీ ఇడియట్స్‌’, ‘ధూమ్‌-3’ చిత్రాల వసూళ్లను మాత్రం అధిగమించింది.