మీరు తీసిన సినిమాలు కాపీలే!.. విమర్శల వర్షం!!

‘ఆస్కార్ విన్నింగ్ సినిమా ‘పారాసైట్’ చూస్తుంటే నిద్ర వ‌చ్చింద‌ని, సినిమా చాలా బోర్’ అని సంచ‌ల‌న కామెంట్స్ చేయడంతో నెటిజ‌న్స్ రాజ‌మౌళిని ఏకిపారేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాజ‌మౌళిపై ఓ యువ దర్శకుడు ఓపెన్ లెట‌ర్ రాస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేసాడు. ‘పారాసైట్’ చిత్రం వాస్త‌విక‌త‌కి అద్దం ప‌ట్టేలా ఉంది. ప్రత్యేకించి భాషా అడ్డంకులను అధిగమించేంత శ‌క్తివంత‌మైన‌దిగా నేను భావిస్తున్నాను. ఈ సినిమా బాలేద‌ని రాజ‌మౌళి అన‌డం ఏ మాత్రం బాగోలేదు. అందుకే ఈ లెట‌ర్ రాస్తున్నాను’.. అని ప్ర‌శాంత్ కుమార్ పేర్కొన్నాడు.
‘ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు పారాసైట్‌ని ఎంత‌గానో ప్రశంసించారు…అదే ‘బాహుబలి’ గురించి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడినట్లు తానెక్కడా వినలేదని.. చూడలేదని, ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే.. మీ ‘సై’ సినిమాలో ఓ సీన్ మొత్తాన్ని కాపీ చేసారు అని ప్ర‌శాంత్ త‌న లేఖ‌లో పేర్కొన్నాడు. ‘సై’తో పాటు మీరు తీసిన చాలా చిత్రాలు కూడా కాపీలే. ప‌బ్లిక్ ప్లాట్‌ఫాంలో ‘పారాసైట్’ లాంటి చిత్రాన్ని మీరు కించ‌ప‌ర‌చ‌డం ఏ మాత్రం బాగోలేదు. సినిమా చూడాలంటే నిర్ధిష్ట మాన‌సిక స్థితి .. మనస్సు అవ‌స‌రం అని నేను అర్ధం చేసుకున్నాను. కాని మీరు ఆ మాన‌సిక స్థితిలో లేర‌ని నేను భావిస్తున్నాను’ అని ప్ర‌శాంత్ కుమార్ త‌న లెట‌ర్‌లో పేర్కొన్నారు. ఈ యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ 2019లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా ‘మిఠాయి’ సినిమా కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
 
విమర్శలతో విరుచుకుపడ్డారు!
రాజమౌళిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న సినిమాపై రాజమౌళి చేసిన కామెంట్‌కి ప్రతిగా నెటిజన్లు ఆయనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన రాజమౌళి ‘పారాసైట్‌’ అనే సౌత్‌ కొరియా సినిమా చూశారు. అంతటితో ఆగకుండా, ‘పారాసైట్‌ సినిమా చాలా బోరింగ్‌గా అనిపించింది. సినిమా చూస్తూ మధ్యలోనే నిద్రపోయాను. నాకు ఈ సినిమా నచ్చలేదు’ అని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డు అందుకున్న ఉత్తమ చిత్రం గురించి రాజమౌళి ఇలాంటి పోస్ట్‌ పెట్టడం ఏంటని నెటిజన్లు తమదైన శైలిలో విమర్శల్ని గుప్పించారు. ‘పారాసైట్‌’ చిత్రం ఆస్కార్‌ ఉత్తమ చిత్రం విభాగంలోనే కాకుండా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ విదేశీ చిత్రం విభాగాల్లో సైతం ఆస్కార్‌లను దక్కించుకుంది. అంతేకాదు ఒక సౌత్‌ కొరియన్‌ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ విదేశీ చిత్రం రెండు విభాగాల్లోనూ ఆస్కార్‌ని కైవసం చేసుకోవడం ఆస్కార్‌ చరిత్రలోనే ఓ విశేషం. అలాగే కేన్స్‌తో సహా పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లోనూ ఈ చిత్రం అనేక అవార్డులను అందుకుంది .