రాబోయే సినిమాలోనూ డాన్ గానే రజనీ ?

రజనీకాంత్ స్టైల్‌కు, ఆయన హీరోయిజానికి డాన్ పాత్రలు బాగా నప్పుతాయి. ‘బాషా’ సినిమాలో రజనీకాంత్‌ డాన్‌గా కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయనను తరచుగా అలాంటి పాత్రల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు. అయితే కొన్ని క్లిక్ అయ్యాయి… కొన్ని కాలేదు. ఈమధ్య ‘కబాలి’, ‘కాలా’ చిత్రాల్లో కూడా రజనీని డాన్‌గానే చూపించారు. అయితే ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయినా సరే కొత్త చిత్రంలో మరోసారి ఈ సూపర్‌స్టార్‌ను డాన్ అవతారంలో చూపించబోతున్నారట . ఈ సినిమాలో పగలంతా  హాస్టల్ వార్డెన్‌గానో.. కాలేజి ప్రొఫెసర్ గానో ఉండే రజనీకాంత్ … రాత్రి అయ్యేసరికి డాన్‌గా మారిపోతారట. మరి రాత్రిపూట ఈ డాన్ ఏం చేస్తాడన్నది తెలియాలంటే … ‘పిజ్జా’ ఫేమ్‌ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కొత్త చిత్రం విడుదల కావాల్సిందే. తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలు తీసిన ఈ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో రజనీకాంత్ ఈ సినిమా చేయడానికి అంగీకరించాడు.
 
విజయ్‌ సేతుపతి, సిమ్రాన్, నవాజుద్దీన్‌ …
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ డెహ్రాడూన్‌లో జరుగుతోంది. ఆతర్వాత మధురైలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతుంది.ఈ చిత్రాన్నిసన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తారని, నటుడు విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్ర చేయనున్నారని ఇటీవల చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు నటి సిమ్రాన్, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీలు ఈ సినిమా యూనిట్‌లోకి జాయిన్‌ అయ్యారు.ఈ విషయాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సిమ్రాన్‌ని ఏ పాత్రకు తీసుకున్నారనేది బయటపెట్టలేదు. అయితే కోలీవుడ్‌ ఊహల ప్రకారం ఆమెకు రజనీ సరసన నటించే గోల్డెన్‌ చాన్స్‌ దక్కిందట. ఈ సినిమాలో బాబీ సింహా, సానత్‌ రెడ్డి, మేఘా ఆకాశ్‌ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని సమాచారం.ఈ చిత్రం తర్వాత రజనీ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టిపెడతారని తెలిసింది.