రజనీ పుట్టిన రోజే టైటిల్‌గా ఫ్యాన్స్‌ చిత్రం

వయసు పెరుగుతున్నా రజనీకాంత్‌ ఆదరాభిమానాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.అతనికి  అభిమానం గణం అంతా ఇంతా కాదు. ‘కాబలి’ సినిమా దక్షిణాది భాషలో విజయం సాధించకపోయినా మలేషియాలో మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. అంటే అక్కడా ఫ్యాన్స్‌కు కొదవలేదన్నమాట. ఇంతకీ విషయం ఏమిటంటే… ‘రజకాంత్‌ ఫ్యాన్స్‌’పై ఓ చిత్రం రూపొందుతోంది.  అందుకే ఈ చిత్రానికి ’12 డిసెంబర్‌ 1950’ టైటిల్‌గా పెడుతూ ‘ఏ ఫ్యాన్స్‌ స్టోరీ’అని పేర్కొన్నారు. ఆ రోజే రజనీకాంత్‌ జన్మదినోత్సవం.

ఐదుగురు రజనీకాంత్‌ వీరాభిమానుల కథ ఆధారంగా నటుడు, దర్శకుడు సెల్వ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కామెడీ, యాక్షన్‌ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. భారత సినిమా చరిత్రలో హీరోలను అభిమానించడాన్ని రజనీకాంత్‌ అభిమానులు మరో స్థాయికి ఎలా తీసుకెళ్లారో ఈ చిత్రంలో చూపిస్తామని పేర్కొన్నారు. గతంలో ‘గోల్‌మాల్‌’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సెల్వ దాదాపు 19 సంవత్సరాల తర్వాత మళ్లీ మెగాఫోన్‌ పట్టారు. అంతేకాదు ఈ చిత్రంలో ఆయన ఐదుగురు అభిమానుల్లో ఒకరు ‘కబాలి శివ’గా కన్పించబోతున్నారు. రమేశ్‌ తిలక్‌, అజరు, అధవన్‌, ప్రశాంత్‌ మిగతా అభిమానులుగా నటిస్తున్నారు. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను ప్రముఖ తమిళ కథానాయకుడు శివకార్తికేయన్‌ ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.రజనీకాంత్‌ పుట్టిన రోజే టైటిల్‌గా వస్తున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర బృందానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జ్యో స్టార్‌ పతాకంపై ఎం.కోటేశ్వరరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.