రాజకీయరంగ ప్రవేశానికి ముందే మురుగదాస్ తో…

ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘2.ఓ’ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్‌ తన అల్లుడు, నటుడు ధనుష్‌ నిర్మిస్తున్న ‘కాలా’ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి పా.రంజిత్‌ దర్శకుడు.కాగా ‘2.ఓ’ చిత్రం 2018 జనవరిలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాలా చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా విడుదలకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే… రజనీకాంత్‌ తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు….

రజనీకాంత్‌ రాజకీయరంగప్రవేశం చేయబోతున్నారని, త్వరలోనే పార్టీ పేరు, అజెండాను వెల్లడించడానికి చురుగ్గా పనులు జరుగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. మరో పక్క దర్శకుడు వెట్రివేలన్‌ రజనీకాంత్‌ను దర్శకత్వం వహించనున్నారని, ఆయన చెప్పిన చరిత్ర కథ రజనీకి బాగా నచ్చేసిందనే ప్రచారం ఈ మధ్య జోరందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్‌స్టార్‌ తదుపరి చిత్రం ఏమిటన్న విషయంలో క్లారిటి వచ్చింది. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించబోతున్నారు. ఈ విషయమై చర్చలు కూడా పూర్తి అయ్యాయి.దీని గురించి దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ స్వయంగా వెల్లడించారు.

ప్రస్తుతం ఆయన టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా తమిళం,తెలుగు భాషలలో ‘స్పైడర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రకుల్‌ప్రీత్‌సింగ్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఒక్క పాట మినహా పూర్తి అయ్యింది. సెప్టెంబర్‌ చివరిలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ తాను రజనీకాంత్‌ హీరోగా చిత్రం చేయనున్నట్లు తెలిపారు. ఇది ‘కాలా’ చిత్రం తరువాత ఉంటుందని, 2017 చివరలో ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఆయన తాజాగా విజయ్‌ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు