సీక్వెల్‌లో మీరు మాత్ర‌మే చేయాలి సార్‌ !

దేశ చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో `రోబో` సినిమాకు సీక్వెల్‌గా `రోబో 2.0` తెర‌కెక్కుతోంది.  సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `రోబో` ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలోనూ ర‌జ‌నీయే హీరోగా న‌టిస్తున్నారు. అయితే ఈ క‌థ రాసిన త‌ర్వాత ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్‌ను హీరోగా అనుకున్నార‌ట డైరెక్ట‌ర్ శంక‌ర్‌. అతన్ని  క‌ల‌సి క‌థ కూడా వినిపించార‌ట‌.ర‌జ‌నీకాంత్ కూడా ఆమిర్‌ఖాన్‌కు ఫోన్ చేసి `రోబో 2.0`లో హీరోగా న‌టించ‌మ‌ని అడిగార‌ట‌. అయితే ఆ ప్ర‌తిపాద‌న‌ను ఆమిర్ తిరస్క‌రించాట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు….
“రోబో 2.0` సినిమా క‌థ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ మొద‌ట నాకే చెప్పారు. అందులో హీరోగా చేయ‌మ‌ని అడిగారు. క‌థ నాకు బాగా న‌చ్చింది. అయితే క‌థ వింటున్న‌ప్పుడు ర‌జ‌నీనే ఆ సినిమాలో హీరోగా ఊహించుకున్నాను. నేను మొద‌టి పార్ట్ చూశాను. చాలా బాగా నచ్చింది. నేను ర‌జ‌నీకాంత్‌కు పెద్ద ఫ్యాన్‌ని. ఓ అభిమానిగా `రోబో` సీక్వెల్‌లో ఆయ‌నే న‌టించాల‌ని కోరుకుంటాను. ర‌జ‌నీకాంత్‌గారు కూడా ఫోన్ చేసి.. `త‌ప్ప‌కుండా నువ్వు ఈ సినిమా చేయాల‌`ని అడిగారు. కానీ, నేను అంగీక‌రించ‌లేదు. `ఈ సీక్వెల్‌లో మీరు మాత్ర‌మే చేయాలి సార్‌` అని ర‌జ‌నీని ఒప్పించా’న‌ని ఆమిర్ తెలిపారు.