రజినీకాంత్ రాజకీయ పార్టీ… ముఖ్యమంత్రి కమల్‌హాసన్ ?

“రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టినా ముఖ్యమంత్రిగా వేరే ఒకరు ఉంటార”ని ఆ మధ్య రజినీకాంత్ ప్రకటించడం పెద్ద సంచనం కలిగించింది. రజనీ పార్టీతో పొత్తు కుదుర్చుకు నేందుకు మక్కల్‌ నీదిమయ్యం నేతలు మంతనాలు జరుపుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా రెండు పార్టీలలో ఎవరన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రజనీ ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే ప్రసక్తేలేదని గత ఫిబ్రవరిలోనే ప్రకటించారు. అయితే పార్టీ తరఫున విద్యావంతుడైన వ్యక్తిని లేదా మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులలో ఒకరిని ఎంపిక చేస్తానని కూడా తెలిపారు. కనుక రజనీ పార్టీ పెడితే సీఎం అభ్యర్థిగా ఎవరిని ఆ పార్టీ ప్రకటిస్తుంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అయితే మక్కల్‌ నీదిమయ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడైన కమల్‌హాసన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది.

చాలా సంతోషాన్ని తెచ్చిపెట్టింది!… రజనీకాంత్‌ పార్టీని ప్రారంభించక ముందే ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు ‘మక్కల్‌ నీదిమయ్యం’ అధ్యక్షుడు ‘ఉలగనాయగన్’‌ కమల్‌హాసన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ వర్గంతో మక్కల్‌ నీదిమయ్యం సీనియర్‌ నేతలు రహస్య మంతనాలు సాగిస్తున్నారు. “వచ్చే యేడాది జనవరిలో పార్టీ ప్రారంభిస్తా”నంటూ రజనీకాంత్‌ చేసిన ప్రకటన అన్నాడీఎంకే, డీఎంకే వంటి ప్రధాన పార్టీలకు గుబులు పుట్టించింది. అయితే రజనీ ప్రకటన ‘మక్కల్‌ మండ్రం’ నేతలు, కోట్లాదిమంది అభిమానులలో కలిగించిన సంతోషం కంటే అత్యధికంగా సంతోషపడింది.. ‘మక్కల్‌ నీదిమయ్యం’ అధ్యక్షుడు, ఆయన చిరకాల సినీరంగ మిత్రుడు కమల్‌హాసన్‌ అంటే అతిశయోక్తికాదు. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తృతీయ కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఫలించక.. అన్నాడీఎంకే కూటమి, డీఎంకే కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న ఏ పార్టీలతో పొత్తుపెట్టుకోవాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడిన కమల్‌హాసన్‌కు రజనీకాంత్‌ చేసిన ప్రకటన చాలా సంతోషాన్ని తెచ్చిపెట్టింది.

మద్దతు తప్పకుండా కోరతా !… రజనీ పార్టీ ప్రారంభించినా, ప్రారంభించకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మద్దతు తప్పకుండా కోరతానని ఇటీవల కమల్‌హాసన్‌ పలు సభల్లో చెబుతూ వచ్చారు. రజనీ గత సోమవారం ‘మక్కల్‌ మండ్రం’ నేతలతో సమావేశమైన తర్వాత.. పార్టీ ప్రారంభించే విషయమై ప్రకటన చేస్తారని రజనీ అభిమానులతోపాటు కమల్‌హాసన్‌ కూడా ఆశగా ఎదురు చూశారు. ఎట్టకేలకు రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారని.. జనవరిలో పార్టీని పెడుతున్నారని తెలియటంతో కమల్‌ హాసన్‌తోపాటు మక్కల్‌ నీదిమయ్యం నేతలంతా పండగ చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ కమల్‌ చేతుల కలిపితే ఘనవిజయం ఖాయమైపోయిందన్న భావనలో వారున్నారు.

 

ఇప్పటికే వారిమధ్య అవగాహన!… కమల్‌కు సంబంధించిన సినిమా ఫంక్షన్‌లో గతంలో రజనీ మాట్లాడుతూ..  భవిష్యత్‌ అంగీకరిస్తే రాజకీయాల్లో కమల్‌హాసన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించిన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. సినీరంగంలో ఇద్దరూ పోటీపడినా వారిలో ఈర్ష్య, ద్వేషాలు లేవు. ప్రాణమిత్రులుగానే ఉంటున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఈ నెలఖారులోగా తన మిత్రుడు కమల్‌హాసన్‌ ని  స్వయంగా కలుసుకుని పొత్తు ఏర్పాటుపై చర్చలు జరిపే అవకాశం లేకపోలేదని కూడా ఆ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే వారిమధ్య రాజకీయ విషయాలపై ఒక అవగాహన ఉందని .. కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య భిన్న అభిప్రాయాలున్నప్పటికి వారు ‌అంతగా పట్టించుకోరని.. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ద్రవిడ పార్టీలను ఓడించాలన్నదే ఇరువురి ప్రధాన ఆశయం గనుక రెండు పార్టీల మధ్య పొత్తు ఏర్పడం ఖాయమని ఇరు పార్టీల నాయకులు చెబుతున్నారు.