ఫ్యాన్స్‌కు పండుగే… రజిని ‘దర్బార్’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్: 3/5

ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌ దర్శకత్వంలో  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ పతాకంపై  సుభాస్క‌ర‌న్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎన్‌.వి.ప్ర‌సాద్‌ తెలుగులో విడుదల చేసారు.

కధ… ఆదిత్య అరుణాచ‌లం(ర‌జినీకాంత్‌) ముంబై క‌మిష‌న‌ర్ , గ్యాంగ్‌స్ట‌ర్స్‌ను ఎన్‌కౌంట‌ర్ చేస్తుంటాడు. ఒక‌రోజులోనే 13 మందిని ఎన్‌కౌంట‌ర్ చేస్తాడు. దాంతో ముంబైలోని దాదాలంద‌రూ భ‌య‌ప‌డిపోతుంటారు. మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్‌ను కూడా ఆదిత్య అరుణాచ‌లం లెక్క చేయ‌డు. అక్క‌డ నుండి క‌థ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది… ఢిల్లీ నుండి ముంబైకి స్పెష‌ల్ ఆర్డ‌ర్ మీద ఆదిత్య ముంబై వ‌స్తాడు. హ‌రి చోప్రా(సునీల్ శెట్టి) కార‌ణంగా ముంబై పోలీసుల‌ను ఎవ‌రూ లెక్క‌చేయ‌రు. ప్ర‌జ‌ల్లో పోలీసులంటే భ‌యం ఉండ‌దు. ఆ స‌మ‌యంలో ముంబైలో అడుగు పెట్టిన ఆదిత్య‌కు డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ కుమార్తె కిడ్నాప్ గురించి తెలుస్తుంది. ఆమెను క‌నిపెడుతూనే.. ముంబైలోని డ్ర‌గ్స్, హ్యుమ‌న్ ట్రాఫికింగ్ స‌మ‌స్య‌ను నిర్మూలిస్తాడు. దాంతో ప్ర‌జ‌ల‌కు మ‌ళ్లీ పోలీసులంటే న‌మ్మ‌కం పెరుగుతుంది. అదే స‌మ‌యంలో వినోద్ మల్హోత్రా(న‌వాబ్ షా) కొడుకు అజ‌య్ మ‌ల్హోత్రా(ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌) కార‌ణంగానే ముంబైలోడ‌గ్స్ రాకెట్ డెవ‌ల‌ప్ అయ్యింద‌ని తెలుస్తుంది. దీంతో అత‌న్ని అరెస్ట్ చేసి శిక్ష ప‌డేలా చేస్తాడు. దాంతో అత‌న్ని త‌ప్పించ‌డానికి వినోద్ మ‌ల్హోత్రా ఓ ప్లాన్ వేస్తాడు. అయితే ఆ ప్లాన్‌ని క‌నిపెట్టేసిన ఆదిత్య ఏం చేస్తాడు?. ఇంతకు వినోద్ మ‌ల్హోత్రా వేసే ప్లాన్ ఏంటి? అజ‌య్‌కి హ‌రి చోప్రాకు ఉన్న లింకేంటి? ఈ విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి….

విశ్లేషణ… దక్షిణాది సినిమాకి తిరుగులేని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఆయనకు వయస్సు పెరుగుతున్నా.. స్టామినా మాత్రం తగ్గడం లేదు. ర‌జినీకాంత్ తో ఓ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుని.. మురుగ‌దాస్‌ చేసిన సినిమాయే ‘ద‌ర్బార్‌’.రజనీకాంత్‌ ఇమేజ్ ని ఉపయోగించుకోవడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. ‘దర్బార్‌’ పూర్తిగా రజనీ స్టైల్‌, మ్యానరిజమ్స్‌, పంచ్‌ డైలాగుల మీద ఆధారపడింది. తన సినిమాల్లో ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ ని చర్చించే మురగదాస్ ఈ సారి మహిళలపై వేధింపులు, హెరాస్మెంట్ ని ప్రధానంగా తీసుకున్నాడు.సినిమా ఫస్టాఫ్ రజనీ స్టైల్స్,మేనరిజంలతో అదరకొడితే..సెకండాఫ్ మురగదాస్ తన స్టైల్ స్క్రీన్ ప్లే తో నడిపాడు …సెకండాఫ్‌లో కథ కొంచెం నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌ వరకు సినిమా బాగున్నా.. క్లైమాక్స్ కు వచ్చేసరికి రొటీన్ గా, కొత్తదనం లేకపోవడం ఇబ్బంది కరం. కొన్ని స‌న్నివేశాలు అతిశ‌యోక్తి అనిపించినా రజనీ క‌మ‌ర్షియ‌ల్ ఇమేజ్‌లో కొట్టుకుపోతాయి. అలాగే సెకండాఫ్ లో వచ్చే తండ్రి, కూతుళ్లు సెంటిమెంట్ హై డోస్ సీన్స్ అతి అనిపిస్తాయి.ఈ సినిమాలో హైలెట్ ఫైట్ సీక్వెన్స్ లు. మరీ ముఖ్యంగా రైల్వే స్టేషన్ దగ్గర వచ్చే యాక్షన్ ఎపిసోడ్. ర‌జినీకాంత్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ సింప్లీ సూప‌ర్బ్‌. మాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునే స్టైల్లో రామ్‌ల‌క్ష్మ‌ణ్ ఫైట్‌ను డిజైన్ చేశారు.
 
నటవర్గం… ర‌జినీకాంత్ పోలీసు ఆఫీసర్‌గా తన స్టైలిష్ పెర్ఫామెన్స్‌తో సినిమా అంతా తానై క‌నిపించాడు.ఈ సినిమా రజనీ ఫ్యాన్స్‌కు పండుగే. కధానాయికగా నయనతార బాగుంది..ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించింది. కానీ ఆమె పాత్ర చాలా చిన్నది. నివేదిత థామస్ తన పాత్రకు న్యాయంచేసింది. సునీల్ శెట్టి..ప్రతీక్ బబ్బర్..న‌వాజ్‌షా బాగానే చేసారు. యోగిబాబు ఉన్నంత‌లో కామెడీతో న‌వ్వించే ప్రయ‌త్నం చేశాడు.
 
సాంకేతికం… అనిరుధ్ పాట‌లు తెలుగు ఆడియెన్స్‌కు పెద్ద‌గా క‌నెక్ట్ కావు. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం అనిరుద్‌ అందించిన నేపథ్య సంగీతం. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో చాలా సీన్లను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తన మ్యాజిక్ ని ఈ సినిమాకు అందించారు. రజనీ ఇంట్రడక్షన్ సీన్ లో లైటింగ్, ఫ్రేమింగ్ ఒక్కటి చాలు అతని గొప్పదనాన్ని చెప్పటానికి. శ‌్రీక‌ర్ ప్ర‌సాద్‌ ఎడిటింగ్ బావుంది. అయితే నయనతార, రజనీల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్, వెడ్డింగ్ సాంగ్ ని కాస్త ట్రిమ్ చేస్తే ఇంకా బాగుండేది – రాజేష్