నన్ను న‌మ్ముకున్న వాళ్ల కోసం వెనుక‌డు‌గు వేస్తున్నా !

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ.. ర‌జ‌నీకాంత్ పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న కోసం అభిమానులు ఎదురు చూస్తున్న వేళ.. ర‌జ‌నీకాంత్ త‌న ఫ్యాన్స్ ని ఉద్దేశించి లేఖ రాసారు. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. త‌మిళ ‘సూపర్ స్టార్’ ర‌జనీకాంత్‌ స్టైల్‌కు దేశ విదేశాల‌లో లెక్కకి మించిన ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే సినిమాల‌తో కొన్ని ద‌శాబ్ధాలుగా అల‌రిస్తూ వ‌స్తున్న ర‌జ‌నీకాంత్.. ప్ర‌జల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతో గ‌తంలో పార్టీ పెడతానని ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వ‌ర్క్ కూడా మొద‌లు పెట్టారు. అయితే క‌రోనా ఎఫెక్ట్ తో రజ‌నీకాంత్ ప్లాన్ పూర్తిగా త‌ల‌కిందులైంది. రాజ‌కీయాల‌కే గుడ్ బై చెప్పాల‌నే ఆలోచ‌న‌లో రజ‌నీ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ర‌జ‌నీకాంత్ పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించి త‌న ఫ్యాన్స్ ని ఉద్దేశించి రాసిన లేఖలో.. ” అభిమానులు, ప్ర‌జ‌లే నా దేవుళ్ళు. వారికి నిజాలు చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్ధేశంతోనే  నేను రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాను. దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న కూడా చేశాను. మదురైలో అక్టోబర్ 2న భారీసభ నిర్వహించి పార్టీ పేరు జెండా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ అదే సమయంలో కరోనా రావ‌డంతో విర‌మించుకున్నాను.

కిడ్నీ సమస్య తో బాధ‌ప‌డ్డ నేను 2011లో సింగ‌పూర్‌లో వైద్యం చేయించుకున్నాను. 2016లో ఆ స‌మ‌స్య మ‌ళ్ళీ రావ‌డంతో అమెరికా వెళ్లి మార్పిడి చేసుకున్నా. ఈ విష‌యం నా స‌న్నిహితుల‌కు మాత్ర‌మే తెలుసు. నాకు కిడ్నీ మార్పిడి జ‌ర‌గ‌డం వ‌ల‌న రోగ నిరోధ‌క శ‌క్తి చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల‌న ఎవరిని క‌ల‌వ‌డానికి వీలు లేకుండా పోయింది. వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌డం లేదు. పార్టీ పెట్టాలన్నా, రాజ‌కీయాలు చేయాల‌న్నా.. న‌లుగురితో త‌ప్ప‌క క‌ల‌వాల్సి ఉంటుంది. కాని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో సాధ్యం కాదు. ప్రాణ‌భ‌యం నాకు లేదు కాని, నన్ను న‌మ్ముకున్న వాళ్ల కోసం వెనుక‌డు‌గు వేస్తున్నాను.

రాజ‌కీయ పార్టీ ప్రారంభించే ఆలోచ‌న ఉంటే జ‌న‌వ‌రి 15 లోపే మొద‌లు పెట్టాలి. అంటే డిసెంబ‌ర్‌లో నిర్ణ‌యం తీసుకోవాలి. నా రాజకీయ ఎంట్రీ కోసం నేను సుధీర్ఘంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటాను. నా నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు, అభిమానులు స్వాగతిస్తార‌ని ఆశిస్తున్నాను”.. అంటూ ర‌జ‌నీకాంత్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

ఈ వార్త‌లు అన్నీ వాస్త‌వాలే !… ట్విట్ట‌ర్ ద్వారా గ‌త రాత్రి నుండి వ‌స్తున్న అనేక ప్ర‌చారాల‌కు త‌మిళ సూపర్ స్టార్ రజ‌నీకాంత్  అడ్డుక‌ట్ట వేశారు. 2011లో ర‌జనీకాంత్‌ కిడ్నీ సమస్య తో బాధ‌ప‌డ్డార‌ని, దీని కోసం ఆయ‌న  సింగ‌పూర్‌లో వైద్యం చేయించుకున్నార‌ని లేఖ‌లో ఉంది. ఇక 2016లో ఆ స‌మ‌స్య మ‌ళ్ళీ రావ‌డంతో అమెరికా వెళ్లి మార్పిడి చేసుకున్నారంటూ కూడా లేఖ‌లో రాసారు. అయితే ఈ వార్త‌లు అన్ని వాస్త‌వాలే అంటూ త‌లైవా క్లారిటీ ఇచ్చారు.

“అభిమానుల‌ని ఉద్దేశించి నేను రాసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న లేఖ మాత్రం నాది కాదు. ‘ర‌జ‌నీ మ‌క్క‌ల్ మంద్రం’ స‌భ్యుల‌తో క‌లిసి చ‌ర్చించాక నేను రాజ‌కీయ పార్టీకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేస్తాను” అని త‌లైవా పేర్కొన్నారు. కాగా, ర‌జ‌నీకాంత్ పేరుతో లీకైన లెట‌ర్‌లో.. తన‌కు “కిడ్నీ మార్పిడి వ‌ల‌న రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. క‌రోనా స‌మ‌యంలో పార్టీ ప్ర‌క‌టించ‌డం, అంద‌రితో క‌లిసి స‌భ‌లు పెట్ట‌డం ప్రాణాల‌కు రిస్క్‌. అందుకే పార్టీ ప్ర‌క‌ట‌న‌పై ఆలోచిస్తున్నా!” అంటూ లేఖ‌లో రాసి ఉంది.