అతనికి సహాయపడాలని సగానికి తగ్గాడు !

‘సూపర్‌స్టార్’ రజనీకాంత్…  అత్యధిక పారితోషికం తీసుకునే రజనీ ఇప్పుడు సగానికి సగం తగ్గించేశాడట.చాలాకాలం క్రితమే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివాజీ’ సినిమాకి ఏకంగా 56 కోట్ల పారితోషికం తీసుకుని ఏసియాలో జాకీచాన్ తర్వాత అంతటి రెమ్యునరేషన్ తీసుకున్న నటుడిగా రికార్డులకెక్కాడు రజనీకాంత్. అయితే, ఇప్పుడు రజనీకాంత్ ఇమేజ్ మెల్లగా తగ్గుముఖం పడుతోంది. ‘శివాజీ’ తర్వాత ‘రోబో’ వంటి భారీ విజయాన్ని అందుకున్న రజనీ.. ఆ తర్వాత నటించిన ‘కొచ్చాడయాన్’, ‘లింగా’, ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలు ఆడియెన్స్‌ ఆశించిన స్థాయిలో లేవు. ఇక ఇండియాలోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘2.0’ కూడా మంచి కలెక్షన్లే సంపాదించినా బడ్జెట్ బాగా ఎక్కువ కావడంతో.. కాస్ట్   ఫెయిల్యూర్‌గా మిగిలింది. లేటెస్ట్‌గా పొంగల్ బరిలో వచ్చిన ‘పేట్ట’ కూడా ఆశించినంత రజనీ పవర్ చూపలేకపోయింది.తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించకపోతుండడంతో పారితోషికం విషయంలో పట్టు వీడాడట సూపర్ స్టార్.
మురుగదాస్ దర్శకత్వంలో నటించబోయే తన 166వ చిత్రంకోసం రెమ్యూనరేషన్‌ను సగానికి తగ్గించేశాడట. రజనీకాంత్‌తో భారీ బడ్జెట్ చిత్రం ‘2.0’ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ఇప్పుడు మురుగదాస్ సినిమాని నిర్మిస్తోంది. అందుకే విజువల్ వండర్ ‘2.0’ కోసం భారీ స్థాయిలో పుచ్చుకున్న రజనీ.. ఇప్పుడు ఈ సినిమాకోసం అందులో సగం మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నాడట. ‘2.0’ కోసం భారీగా ఖర్చు చేసి నష్టపోయిన లైకా ప్రొడక్షన్స్  సుభాస్కరన్ కు సహాయపడాలనేదే అతని ఉద్దేశం.  
పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కే రజనీకాంత్-మురుగదాస్ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో రజనీ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించనుంది.