సంజయ్‌దత్ సినిమాకు భారీ స్థాయి బిజినెస్‌

సంజయ్‌దత్ జీవిత కథ వెండితెరపై రానున్నదని దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ ప్రకటించిన రోజు నుంచే ఆ సినిమా ఎప్పుడు తమ ముందుకు వస్తుందా?.. అని జనం ఎదురుచూడ్డం మొదలుపెట్టారు. ఇక సంజయ్‌ వేషంలో ఉన్న రణబీర్‌ కపూర్‌ స్టిల్స్‌ బయటకు పొక్కినప్పట్నించీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ ఆసక్తి రేకేత్తిస్తునే ఉన్నాయి. మొదట సంజయ్‌ వేషానికి రణబీర్‌ ఎలా సరిపోతాడని విమర్శించినవాళ్లు కూడా అతని గెటప్ చూసి మెచ్చుకున్నారు. కాగా సినిమా సగం పూర్తయ్యేసరికి థియేట్రికల్‌ రైట్స్‌ భారీ స్థాయిలో అమ్ముడై విశ్లేషకుల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫాక్స్‌ స్టార్‌ స్టూడియో ఈ హక్కుల్ని ఏకంగా రూ. 180 కోట్లకు కొనుగోలు చేసిందని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. ఇది ఎగ్జిబిటర్‌ డీల్‌ మాత్రమేననీ, శాటిలైట్‌ హక్కులు ఇందులో లేవనీ సమాచారం. నిర్మాత కూడా అయినా రాజ్‌కుమార్‌ హిరాణీకీ, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోకూ కుదిరిన ఒప్పందం ప్రకారం లాభాల్లో 85 శాతం వాటా హిరాణీకీ, 15 శాతం వాటా ఫాక్స్‌ స్టార్‌కూ వెళతాయి. హిరాణీ మునుపటి సినిమా ‘పీకే’.. థియేట్రికల్‌, శాటిలైట్‌ రైట్స్‌ కలిపి రూ. 110 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో సంజయ్‌ బయోపిక్‌ రైట్స్‌ బాలీవుడ్‌లో సంచలనం కలిగించాయి. పరేశ్ రావల్‌ (సునీల్‌ దత్), మనీషా కొయిరాలా (నర్గీస్‌), సోనమ్‌ కపూర్‌ (టీనా మునిమ్‌), దియా మీర్జా (మాన్యతా దత్), కరిష్మా తన్నా (మాధురీ దీక్షిత్) నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేస్తున్నారు .