‘రాజ్‌పుత్‌’ ఓటుబ్యాంక్‌ కోసం…రాజకీయ కుట్ర !

# 1988లో నేను సీరియల్‌గా తీస్తే ఎలాంటి వ్యతిరేకత రాలేదు
#నేడు భన్సాలీ తీస్తే ఎందుకు వస్తున్నాయి? 

                                           – ‘పద్మావత్‌’ నిరసనలపై ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌

సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘పద్మావత్‌’, 1988లో నేను సీరియల్‌గా తీసిన ”భారత్‌ ఏక్‌ ఖోజ్‌’ రెండూ దాదాపు ఒకటే. మరి ఆనాడు వ్యక్తంకాని నిరసనలు, ఈనాడు ఎందుకు ఇంతపెద్ద స్థాయిలో వస్తున్నాయో అర్థం కావటం లేదు. ‘పద్మావత్‌’ను అడ్డుకునే శక్తుల వెనుకున్నవారికి రాజకీయ ప్రయోజనముంది. ‘రాజ్‌పుత్‌’ ఓటుబ్యాంక్‌ కోసం..రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారన్నది నా పరిశీలన..అని ప్రముఖ దర్శకుడు శ్యామ్‌బెనెగల్‌ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమా పేరు చెప్పి, రాజకీయ ప్రయోజనాల కోసం.. దేశవ్యాప్తంగా హింసరేపాలన్న కుట్ర దాగివుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…

– మీరు ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది సహనం, అసహనానికి సంబంధించిన విషయం కాదు. దానికి మించి ఇంకా ఏదో ఉంది. 1988లో ‘భారత్‌ ఏక్‌ ఖోజ్‌’ 56 ఎపిసోడ్స్‌తో సీరియల్‌గా తీశాను. దూరదర్శన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ప్రసార మైంది. ఇందులో ఓంపురి అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాత్ర పోషించారు. ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ తీసింది కూడా ఇదే కథ. నేను తీసిన నాడు ఎలాంటి నిరసనలూ రాలేదు. అంటే ఇప్పుడు వ్యక్తమవుతున్న అభ్యంతరాలు, చోటు చేసుకుంటున్న ఘటనలు ‘పద్మావత్‌’ కథాంశం గురించి కాదన్నమాట.

– దీనివెనుక రాజకీయంగా పెద్ద కుట్రే దాగివుందని నాకనిపిస్తోంది. ‘రాజ్‌పుత్‌’ ఓటుబ్యాంక్‌ను కొల్లగొట్టడానికే ఇదంతా చేస్తున్నారు. స్కూల్‌ పిల్లలు ఉన్న ఓ వాహనంపై దాడి చేస్తారా ? ఈ పని చేయటం ద్వారా దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలను తీసుకురావాలన్నది నిరసనకారుల ఉద్దేశం. దాడికి పాల్పడ్డవారిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు?

–  మాలిక్‌ మొహమ్మద్‌ జయసీ రాసిన సూఫీ కవిత ఆధారంగా ‘పద్మావత్‌’ తెరకెక్కిందనుకుంటే, నేను తీసిన ‘భారత్‌ ఏక్‌ ఖోజా’ సీరియల్‌లోని కొన్ని ఎపిసోడ్స్‌కు జయసీ రాసిన కవితే స్ఫూర్తి.

– విచిత్రమైన విషయం ఏంటంటే…నేను తీసిన ‘భారత్‌ ఏక్‌ ఖోజ్‌’కు సంజయ్ లీలా భన్సాలీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆయన చెల్లెలు బెలా సెహెగల్‌, సోదరుడు దీపక్‌ సెహెగల్‌ కూడా ఎడిటర్స్‌గా పనిచేశారు.

– భన్సాలీ సినిమాను అడ్డుకుంటామని పెద్ద సంఖ్యలో మహిళలు కత్తులు పట్టుకొని మీడియా ముందుకు వచ్చి ‘అగ్నిప్రవేశం’ చేస్తామని బెదిరించారు. టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసం కొన్ని మీడియా ఛానల్స్‌ దీనికి ప్రాధాన్యతనిచ్చాయి.

– చట్టవ్యతిరేకమైన ఇలాంటి హింసాత్మక ధోరణిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరుమెదపకుండా ఉండటం దారుణం. దీనిని ఒక దేశవ్యాప్త ఆందోళనగా మార్చాలన్నదే కర్ణి సేన, ఇతర గ్రూపుల లక్ష్యం. వీరి వెనుక ఎవరున్నారన్న సంగతి పోలీసులకు తెలుసు. అంత బహిరంగంగా ‘పద్మావత్‌’ చిత్ర దర్శకునికి, ఇతర నటులకు వారు బెదిరిస్తే పట్టించుకోరా ?

– భన్సాలీ తీసిన ‘పద్మావత్‌’ చిత్రాన్ని బెంగాలీలెవరూ చీదరించుకోవటం లేదు. అయితే ఈ చిత్రం విషయంలో జరుగుతున్నది మామూలు నిరసన కాదన్నది నా పరిశీలన. ఇది సాధారణమైన నిరసన వ్యవహారం కాదు. దీనికి మించి ఏదో ఉంది.